CS Jawahar Reddy: సిఎస్ ఔట్.. సెలవుపై వెళ్లిన జవహర్ రెడ్డి, కొత్త సిఎస్ ఎంపికపై కసరత్తు…
CS Jawahar Reddy: ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెలాఖరుతో జవహర్ రెడ్డి పదవీ కాలం ముగియాల్సి ఉన్నా ఆయన్ని కొనసాగించేందుకు టీడీపీ సుముఖంగా లేదనే విషయం స్పష్టం కావడంతో సెలవుపై వెళ్లారు.
CS Jawahar Reddy: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. సిఎస్ పదవి నుంచి అధికారికంగా ఆయన వైదొలగినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సిఎస్ ఎంపికపై కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. బుధవారంద చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆయన్నే కొనసాగించే ఉద్దేశం టీడీపీ ప్రభుత్వానికి లేదనే సమాచారాన్ని అందించారు. దీంతో గురువారం జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతో సెలవు పై వెళుతున్నట్లు సిఎస్ లేఖలో పేర్కొన్నారు. GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌కు జవహర్ రెడ్డి సెలవు లేఖను పంపారు.
సాయంత్రానికి కొత్త సిఎస్ నియామకం కొలిక్కి రానుంది. గవర్నర్ అమోదంతో కొత్త సిఎస్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారులను తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాజీనామా చేయని సలహాదారులను కూడా తొలగించాలని ఆదేశించింది. అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సిఎస్ మార్పు జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. బుధవారం చంద్రబాబుతో భేటీ తర్వాత ప్రస్తుత సిఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సూచించినట్టు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. బుధవారం చంద్రబాబుతో సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సిఎస్‌ను కొనసాగింపు ఉండకపోవచ్చని ఆయన స్థానంలో సీనియర్లకు అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. ఆర్పీ సిసోడియా, నీరబ్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బుడితి రాజశేఖర్ సైతం సిఎస్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
సిఎస్‌పైనే అందరి దృష్టి….
ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించడానికి సిఎస్ జవహార్ రెడ్డే కారణమని సిఎం చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కలవడానికి వచ్చిన జవహార్ రెడ్డితో చంద్రబాబు అంటిముట్టనట్టు వ్యవహరించారు. వీలైనంత త్వరగా పదవి నుంచి తప్పుకోవాలని సిఎస్‌కు టీడీపీ సందేశం పంపినట్టు తెలుస్తోంది.
టీడీపీపై జరిగిన కక్ష సాధింపు వ్యవహారాలు, ఆర్ధిక అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, వైసీపీకి అన్ని విధాలుగా సహకరించడంలో సిఎస్ జవహర్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్ రావడానికి ముందు నుంచి సిఎస్‌ను తప్పించాలని డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీలో అదృశ్య శక్తులు ఆశీస్సులు అందించడంతో పదవికి ఎలాంటి గండం లేకుండా గడిచిపోయింది.
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజకీయంగా టీడీపీ నష్టపోయేలా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం వరకు సిఎస్ కొనసాగుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే గురువారం ఆన సెలవుపై వెళ్లిపోవడంతో క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రిగా చంద్ర బాబు ప్రమాణ స్వీకారానికి ముందే జవహర్ రెడ్డి పదవిని పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
సంబంధిత కథనం