ఏపీ సీఆర్డీఏలో ఏమి జరుగుతోంది... ! కమిషనర్‌ బదిలీపై జోరుగా ప్రచారం.. పనుల తీరుపై సీఎం అసంతృప్తి…!-ap crda commissioner transfer rumors surface amidst cms dissatisfaction with project progress ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ సీఆర్డీఏలో ఏమి జరుగుతోంది... ! కమిషనర్‌ బదిలీపై జోరుగా ప్రచారం.. పనుల తీరుపై సీఎం అసంతృప్తి…!

ఏపీ సీఆర్డీఏలో ఏమి జరుగుతోంది... ! కమిషనర్‌ బదిలీపై జోరుగా ప్రచారం.. పనుల తీరుపై సీఎం అసంతృప్తి…!

Sarath Chandra.B HT Telugu

ఏపీ సీఆర్డీఏలో ఏమి జరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏడాదిలో ఇద్దరు కమిషనర్లు మారినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సీఆర్డీఏ పాలన సాగకపోవడంతో సీఆర్డీఏలో మార్పులు తప్పవని ప్రచారం జరుగుతోంది.

సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌‌కు స్థాన చలనం తప్పదని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్లలో అమరావతికి ఓ రూపునివ్వాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారుల పనితీరు లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ- సీఆర్డీఏ బాధ్యతల్ని కాటమనేని భాస్కర్‌కు అప్పగించారు. కొద్ది నెలలకే మంత్రి నారాయణతో పొసగక పోవడంతో ఆయన్ని బదిలీ చేశారు. మంత్రి నారాయణ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయక పోవడంతోనే కాటమనేని భాస్కర్‌ను సీఆర్డీఏ బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది.

కాటమనేని బదిలీ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులకు సర్ది చెప్పాల్సి వచ్చింది. కాటమనేని భాస్కర్‌ బదిలీ తర్వాత కన్నబాబుకు సీఆర్డీఏ కమిషనర్ పదవి దక్కింది.

కమిషనర్‌ మారినా ఆ తర్వాత కూడా సీఆర్డీఏలో పాలనా వ్యవహారాల్లో ఎలాంటి మార్పు రాలేదనే అసంతృప్తి మంత్రి నారాయణలో ఉంది. ఈ క్రమంలో సీఆర్డీఏ సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి అధికారులు, పురపాలక శాఖ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని పనుల్లో వేగం లేకపోవడం, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు ముందుకు సాగక పోవడం సీఆర్డీఏ సమీక్షల్లో ప్రస్తావనకు వచ్చింది. రాజధాని పనుల విషయంలో అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారుల నుంచి తనకు సహకారం లభించడం లేదని మంత్రి నారాయణ వాపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సిఫార్సులు బుట్టదాఖలు...

సీఆర్డీఏలో పనులు మందకొడిగా సాగుతుండటంపై టీడీపీ స్ట్రాటజీ బృందం కొందరు అధికారుల్ని కీలక బాధ్యతల నుంచి తప్పించాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు అధికారులు గతంలో వైసీపీ నేతలతో అంట కాగారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నలుగురు అధికారుల్ని సీఆర్డీఏ నుంచి తప్పించాలని టీడీపీ స్ట్రాటజీ బృందం సిఫార్సు చేసినా కమిషనర్‌ వాటిని పట్టించుకోలేదని తెలుస్తోంది.

ఏడీసీ-సీఆర్డీఏ మధ్య సమన్వయ లేమి..

మరోవైపు సీఆర్డీఏలో కీలకమైన పనులు ఏడీసీ ఆధ్వర్యంలో జరుగుతుంటే, భూసేకరణ పనులు సీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఏడీసీకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ పార్థసారథి సారథ్యం వహిస్తున్నారు. ఏడీసీ ఏర్పాటైనప్పటి నుంచి ఆ స్థానంలో ఆమె ఉన్నారు. ఏడీసీకి రెగ్యులర్‌ ఐఏఎస్‌ అధికారి లేకపోవడంతో కింద స్థాయి సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. సీఎం సమక్షంలో జరిగే సమీక్షల్లో కింది స్థాయి అధికారులపై ఆధారపడాల్సి వస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఏడీసీ, సీఆర్డీఏలలో ఎవరు ఏ పనిచేస్తున్నారనేది కనీసం ఆ శాఖ మంత్రికి కూడా తెలియదని, సమీక్షలో చివాట్లు మాత్రం మంత్రికి దక్కుతున్నాయని చెబుతున్నారు. ఏడీసీ-సీఆర్డీఏల మధ్య సమన్వయం లేక పోవడంతో ఎవరి దారి వారిదే అన్నట్టు ప్రస్తుతం వ్యవహారం సాగుతోంది.

పునరావాస కేంద్రంగా ఏడీసీ, సీఆర్డీఏ...

ఏడీసీ, సీఆర్డీఏ ఉద్యోగ నియామకాల్లో ఏమి జరుగుతుందో కూడా ఎవరికి తెలియడం లేదు. సీఆర్డీఏలో పరిమిత సంఖ్యలో శాశ్వత ఉద్యోగులు ఉండటంతో ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారితో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన వారిని వారు ఉద్యోగాల్లో పెట్టేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు సీఆర్డీఏలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారి తన స్థానం మారినపుడల్లా తనతో పాటు ఆరుగురు సిబ్బందిని వెంట తీసుకు వెళ్లడం రివాజుగా మారింది. డ్రైవర్‌, అడెండర్‌, సీసీ వంటి వారిని ఎక్కడకు వెళితే అక్కడకు బదిలీ చేయించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఏ శాఖకు సంబంధించిన సిబ్బంది అదే శాఖలో కొనసాగాల్సి ఉన్నా సదరు అధికారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

రైతుల సమస్యలు గాలికి...

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో 2014-16 మధ్య కాలంలో సమీకరించిన 34వేల ఎకరాలకు సంబంధించి రైతుల వాటా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక సదుపాయాల లేకపోవడంపై వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో రెండో దశ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతుల ఫిర్యాదులను పరి

సీఆర్డీఏపై ముఖ్యమంత్రి ఫోకస్...

సీఆర్డీఏలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి దాని బాధ్యతల్ని సీనియర్ ఐఏఎస్‌ అధికారికి అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత కమిషనర్‌ కన్నబాబును రాజ్‌భవన్‌‌లో గవర్నర్‌ కార్యదర్శిగా నియమించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న హరిజవహర్‌లాల్‌ జూన్‌ 30న పదవీ విరమణ చేయనుండటంతో ఆ పోస్టులోకి కన్నబాబును పంపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబుకు సీఆర్డీఏ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం