CM Jagan On Aarogyasri: గుడ్ న్యూస్… ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 వైద్య సేవలు
aarogyasri services in andhra pradesh: వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను చేర్చారు.
AP CM YS Jagan Review On Health Department: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం అందుతున్న సేవలకు అదనంగా మరో 809 వైద్య చికిత్సలను చేర్చారు. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే.. క్షతగాత్రులకు వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవా అవార్డులు అందించనున్నట్టు వెల్లడించారు.
ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు బకాయిలు లేకుండా చూస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. రోగులకు మరిన్ని వైద్య సేవలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్, విలేజ్ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... ఆరోగ్య శ్రీ పథకంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ధపాలు వారీగా సేవలను పెంచుతూ వస్తోంది. మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య 1059 కాగా.. జనవరి 2020లో 2059కి పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వైద్యం ఖర్చు వేయి రూపాయల ఖర్చుకు పైబడ్డ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఇక జూలై 2020లో 2200కు పెంచింది. నవంబర్ 2020లో 2436 పెంచటమే గాక... బోన్ మ్యారోతోపాటు 235 ప్రొసీజర్లను చేర్చారు. గతేడాది మే-జూన్ లో 2446కు ఆరోగ్యశ్రీ చికిత్సల పెంచారు. తాజాగా 809 వైద్య చికిత్సలను చేర్చటంతో ఈ సేవలు 3255కు చేరినట్లు అయింది.