Mandous Cyclone Review : తుఫాను బాధితులకు వారంలోగా పరిహారం…..-ap cm ys jagan conducts mandous cyclone review with district collectors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cm Ys Jagan Conducts Mandous Cyclone Review With District Collectors

Mandous Cyclone Review : తుఫాను బాధితులకు వారంలోగా పరిహారం…..

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 06:17 PM IST

Mandous Cyclone Review మాండౌస్‌ తుఫాను బాధితులకు వారంలోగా పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసిన తుఫాను, భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం జగన్
తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం జగన్

Mandous Cyclone Review ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విధ్వంసం సృష్టించిన మాండౌస్ తుపాను తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

తుఫాను బాధితులను ఆదుకునే క్రమంలో కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సిఎం సూచించారు. పంట నష్టాన్ని అంచనా వేసే క్రమంలో బాధితులతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. నష్టపోయిన రైతులు ఎక్కడా రైతులు నిరాశకు గురి కాకూడదని జిల్లా అధికారుల్ని ఆదేశించారు.

రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదని సిఎం జగన్ స్పష్టం చేశారు. ధాన్యాన్ని తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే, వారికి రావాల్సిన రేటు వారికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనన్నారు.

తుఫాను, దాని ప్రభావం వల్ల వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అందరూ రైతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సూచించారు. విత్తనాలు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు అందించాలన్నారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే.. ఆ కుటుంబానికి రూ.2వేల రూపాయలతోపాటు, రేషన్‌ అందించాలన్నారు. ఇంట్లోకి నీళ్లు వచ్చినా సరే, ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదన్నారు.

గ్రామాల్లో, పట్టణాల్లో వర్షపు నీళ్లు ఇంటిలోకి వచ్చి ఉంటే.. కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాల్సిందేనన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా తుఫాను సహాయాన్ని బాధితులందరికీ అందించాలన్నారు. గోడకూలి ఒకరు మరణించిన నేపథ్యంలో వారికి పరిహారం వెంటనే అందించాలన్నారు.

వారంరోజుల్లో ఈ సహాయం అంతా వారికి అందాలన్నారు. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నష్ట పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని, వచ్చే వారంరోజుల్లో ఈ ప్రక్రియ ముగించాలని అధికారులకు సీఎం వైయస్‌.జగన్‌ స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్