'పూర్వోదయ స్కీమ్'ను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు-ap cm urges officials to utilise purvodaya scheme to boost agriculture allied sectors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'పూర్వోదయ స్కీమ్'ను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు

'పూర్వోదయ స్కీమ్'ను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రొత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పూర్వోదయ స్కీంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలని సూచించారు.

పూర్వోదయ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అనుబంధం రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై సీఎం చంద్రబాబు శనివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు.. వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని.. అలాగే రాష్ట్రాభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధాన పంటలతో పాటు... అంతర పంటలు వేయడం ద్వారా కూడా ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలన్నారు.

జాతీయంగా.. అంతర్జాతీయంగా హై డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి ఆ మేరకు ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి... దానికి అనుగుణంగా ఆ పంటలు సాగు చేసేలా రైతులను ప్రొత్సహించాలని చెప్పారు. మన వాతావరణంలో ఏయే పంటలు పండుతాయో అధ్యయనం చేస్తే.. మన వాతావరణంలో పండించగలిగే అన్ని రకాల పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం వివరించారు.

అనుసంధానం చేయాలి…..

ప్రతి రైతును పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇలా చేయగలిగితే రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు. ఈ మేరకు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రొత్సహించాలని అధికారులకు సూచించారు.

ఎఫ్పీఓలకు కేంద్రం ఆర్థికంగా అండగా నిలుస్తోందని చంద్రబాబు వివరించారు. ఉద్యాన రంగ రైతులకు.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అందరికీ కలిసి వచ్చేలా ఓ వర్క్ షాప్ నిర్వహించాలని ఆదేశించారు. అన్ని రకాల ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబులిటీ వచ్చేలా చూడాలని చెప్పారు. అలాగే ఆక్వా ఉత్పత్తుల సాగు రెట్టింపయ్యేలా చూడాలన్నారు. ఆక్వా కల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుపై ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు.

రైతులకు అన్ని రకాలుగా అవగాహన కల్పించేలా రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్లస్టర్ ఆధారంగా పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పశువుల కోసం ఏర్పాటు చేసే సామూహిక షెడ్ల నిర్వహణ, పశు పోషణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతో పాటు.. పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. ఆ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం