YS Jagan Strategy : మౌనం కూడా వ్యూహమేనా…. జగన్‌ మనసులో ఏముంది….?-ap cm political strategy on three capitals issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cm Political Strategy On Three Capitals Issue

YS Jagan Strategy : మౌనం కూడా వ్యూహమేనా…. జగన్‌ మనసులో ఏముంది….?

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 11:10 AM IST

ముఖ్యమంత్రి మనసులో ఏముందో ఎవరికి తెలియదు… మూడు రాజధానుల విషయం కావొచ్చు, రాజకీయ నిర్ణయాలు కావొచ్చు జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం అంత సులువేం కాదు. పంద్రాగస్టు వేడుకల్లో పరిపాలన వికేంద్రీకరణ విషయంలో తానేం అనుకుంటున్నారో చెప్పకనే మరోమారు చెప్పేశారు.

రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వ్యూహం ఏమిటి..?
రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వ్యూహం ఏమిటి..?

విమర్శలు, ఉద్యమాలు, ఆందోళనలు, శపథాలు, కోర్టు కేసులు, రాజకీయ ఆరోపణలు ఇవేమి ముఖ్యమంత్రి ఆలోచనల్లో మార్పు తీసుకు రాలేకపోయాయని మరోమారు స్పష్టమైంది. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పరిపాలన వికేంద్రీకరణ తప్పదని జగన్మోహన్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అధికారిక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ‌్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన నడుస్తోంది. దాదాపు వెయ్యి రోజుల క్రితం 2019 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అంతకు ఆర్నెల్ల ముందే అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణ పనుల్ని ఎక్కడివక్కడే నిలిపివేయాలని ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతాన్ని మూడు ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ‌్యమంత్రి ప్రకటించారు. ఆ తర్వాత పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసన మండలిలో బిల్లులు అమోదం పొందకపోవడంతో ఓ దశలో మండలిని రద్దు చేయడానికి కూడా ముఖ్యమంత్రి వెనుకాడలేదు.

దాదాపు రెండున్నరేళ్లకు పైగా రాజధాని విషయంలో ప్రతిష్టంబన కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా 151 శాసన సభా స్థానాలను గెలుచుకున్న జగన్మోహన్‌ రెడ్డి రాజధాని విషయంలో మాత్రం అనుకున్నది సాధించ లేకపోయారు. పరిపాలన రాజధానిని విశాఖపట్నానికి, శాసన రాజధానిని అమరావతిలో, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలని భావించారు. ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి దానిని అమలు చేసే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. అడుగడుగున ఆటంకాలు ఎదురవ్వడంతో మొండిగా ముందుకెళ్లే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గక తప్పలేదు. సిఆర్డీఏ చట్టాల రద్దు, పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని భూ సమీకరణ వ్యవహ‍ారాలపై ఎడతెగని వివాదాలతో కాలం గడిచిపోయింది.

సుదీర్ఘ విచారణల తర్వాత కోర్టు వివాదాలను తేల్చుకోవడానికి రాజధాని నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినా న్యాయస్థానాలు అంగీకరించలేదు. రాజధాని నిర్మాణం విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఈ నేపథ్యంలో అంతా ప్రభుత్వం న్యాయస్థానాల తీర్పును సమీక్షించాల్సిందిగా అప్పీల్ చేస్తాయని భావించారు. కాని ప్రభుత్వం కోర్టు తీర్పుల విషయంలో కూడా మౌనంగా ఉండిపోయింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వారు తాజాగా ఆగష్టు 15న ఆయన ప్రసంగం గమనించాక పరిపాలన వికేంద్రీకరణ విషయంలో సిఎం వెనక్కి తగ్గడం లేదని చెబుతున్నారు. రాజధాని నిర్మాణ విషయంలో మొదట్నుంచి విశాఖపట్నానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి భారీగా ఖర్చు చేయడం కంటే కాస్మోపాలిటిన్ కల్చర్ ఉన్న విశాఖ రాజధానిగా అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు పారిశ్రామికంగా ఎదగడానికి అనువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాలపై పెట్టుబడులకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో విశాఖ వెళ్లడానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.

ప్రజా తీర్పు వచ్చాకే వెళ్తారా…?

ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా విశాఖపట్నం మకాం మారుస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎన్ని అవంతరాలు ఎదురైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని పట్టుదలపై ఉన్నారు. అయితే అది ఎన్నికలకు ముందు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిపాలన వికేంద్రీకరణను ప్రకటించి ప్రజా తీర్పు కోరుతారని చెబుతున్నారు. అందుకే ఏ తీర్పును కోర్టులో సవాలు చేయడం లేదని, ప్రజల తీర్పుతోనే రాజధాని విషయం మీద తేల్చుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు లభించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది నుంచే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ప్రచారం కూడా లేకపోలేదు.

IPL_Entry_Point

టాపిక్