CM Ys Jagan Schedule: తిరుపతి, కర్నూలు పర్యటనలకు సిఎం జగన్-ap cm jaganmohan reddy will visit tirupati and kurnool districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan Schedule: తిరుపతి, కర్నూలు పర్యటనలకు సిఎం జగన్

CM Ys Jagan Schedule: తిరుపతి, కర్నూలు పర్యటనలకు సిఎం జగన్

HT Telugu Desk HT Telugu
Sep 18, 2023 06:44 AM IST

CM Ys Jagan Schedule: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, కర్నూలు జిల్లాలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మంగళవారం ఉదయం స్వామి దర్శనం తర్వాత కర్నూలు పర్యటనకు వెళ్తారు.

నేడు తిరుమలకు సిఎం జగన్మోహన్ రెడ్డి
నేడు తిరుమలకు సిఎం జగన్మోహన్ రెడ్డి

CM Ys Jagan Schedule: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతి నగరంలో టీటీడీ నిధులతో నిర్మించిన శ్రీనివాస సేతు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రేపటి నుంచి శ్రీనివాస సేతు మీద వాహనాల రాకపోకల్ని అనుమతిస్తారు. ఎస్‌ వి ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ వర్చువల్‌ ప్రారంభోత్సవంలో సిఎం పాల్గొంటారు.

తిరుపతిలో నిర్వహించే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల చేరుకుని వకుళామాత రెస్ట్‌ హౌస్, రచన రెస్ట్‌ హౌస్‌లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం వాహన మండపం చేరుకుని పెద్ద శేష వాహనం దర్శించుకుంటారు. ఆ తర్వాత పద్మావతి అతిధి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

మంగళవారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగునీరందించే పథకాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా డోన్‌ చేరుకుంటారు, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

అన్నదాతలకు ఉపశమనం….

రక్షిత మంచినీరు - సాగునీరు కల నిజం చేసి, చెరువులను పునరుద్ధరించి, జలకళను తీసుకు రావాలన్న లక్ష్యంతో.. వర్షం పడితేనే పంటలు పండే నేలలో కృష్ణా జలాలు పరుగులు పెట్టేలా.. కృష్ణమ్మ జల స్పర్శతో రాయలసీమ అన్నదాతల సాగు కష్టాలకు ఉపశమనం కలిగించేల లక్కసాగరం పంప్‌హౌస్‌ను సిఎం జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు.

10, 394 ఎకరాలకు సాగునీరు, డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజక వర్గాల్లోని ప్రజలకు త్రాగునీరు అందిస్తూ.. 77 చెరువులకు జలకళ చేకూరనుంది. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించి కరువు సీమ దాహార్తి తీర్చడంతో పాటు కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసే సంకల్పంతో.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్క సాగరంలో రూ. 224.31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్నిసెప్టెంబర్19 న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుండి మొదటి దశలో కర్నూలు జిల్లాలోని మెరక ప్రాంతాల్లో ఉన్న 77 చెరువులకు త్రాగు, సాగునీరు సరఫరా జరుగుతుంది. డోన్ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 4,260 ఎకరాలు, పత్తికొండ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 5,784 ఎకరాలకు నీరు అందుతుంది.

ఆలూరు నియోజకవర్గంలో 3 చెరువులక్రింద 197 ఎకరాలు, పాణ్యం నియోజకవర్గంలోని 2 చెరువుల క్రింద 153 ఎకరాలు మొత్తం 77 చెరువుల క్రింద 10,394 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 4 నియోజక వర్గాలలోని ప్రజలకు త్రాగు నీరు.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు పుష్కలంగా పంటలు పండే అవకాశం లభిస్తుంది. వర్షాధారం మీద ఆధారపడిన కర్నూలు జిల్లా పశ్చిమ కరవు ప్రాంతంలోని రైతులకు చెరువులు నింపే కార్యక్రమం అని ప్రభుత్వం చెబుతోంది.

హంద్రీ నీవా ప్రధాన కాలువపై కూర్మగిరి (అలంకొండ) వద్ద పంప్ హౌస్ నిర్మాణం చేపడతారు. 3X3,800 HP మోటార్ల ద్వారా 1.4 టి.ఎం.సి నీటిని 90 రోజులలో పంప్ చేసి 5.6 కి. మీ. ప్రెషర్ మెయిన్ ద్వారా కొండపై ఉన్న డెలివరి ఛాంబర్ కు నీటి మళ్లించి మూడు గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటి మళ్లింపు సరఫరా చేస్తారు. గ్రావిటీ పైప్ లైన్-1 ద్వారా 22 చెరువుల క్రింద 4,217 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.

గ్రావిటీ పైప్ లైన్-2 ద్వారా 16 చెరువుల క్రింద 3,018 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. గ్రావిటీ పైప్ లైన్ - 3 ద్వారా ప్యాపిలీ బ్రాంచ్ ద్వారా 23 చెరువుల క్రింద 2,065 ఎకరాల ఆయకట్టుకు, జొన్నగిరి బ్రాంచ్ ద్వారా 7 చెరువుల క్రింద 830 ఎకరాల ఆయకట్టుకు సాగునీరిస్తారు. మొదట నిర్దేశించిన 68 చెరువులతో పాటు డోన్ నియోజకవర్గంలో 8, పత్తికొండ నియోజకవర్గంలో ఒకటి.. మొత్తం 9 చెరువులకు పైప్ లైన్ ద్వారా అదనంగా నీరు అందించే ఏర్పాటు చేశారు.