AP CM Meets Amit shah : అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ….
AP CM Meets Amit shah ఢిల్లీలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు
AP CM Meets Amit shah ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. "ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కేంద్రంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు స్ధాపించిందని సిఎం గుర్తు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను సైతం తీరుస్తూ... కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇనిస్టిట్యూట్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిందని, దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్ రంగంలో సేవలందించే అటువంటి సంస్ధ లేని లోటు, దానిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి దృష్టికి సిఎ తీసుకువెళ్లారు.
విద్యారంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాకు విన్నవించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని హోంమంత్రికి సిఎం వివరించారు.
2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని, 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదని ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి…..
రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు.