Nellore Politics : గీత దాటొద్దు… కోటంరెడ్డికి సిఎం జగన్ వార్నింగ్….-ap cm jagan warns nellore rural mla kotamreddy sridhar reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cm Jagan Warns Nellore Rural Mla Kotamreddy Sridhar Reddy

Nellore Politics : గీత దాటొద్దు… కోటంరెడ్డికి సిఎం జగన్ వార్నింగ్….

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 08:00 AM IST

స్వపక్షంలో విపక్షంగా తయారైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నెల్లూరులో పార్టీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపుతో విపక్షమే లేకుండా పోయిన కొరతను సొంత పార్టీ నేతలే తీరుస్తుండటంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పరువు తీసేలా బహిరంగ వేదికలపై మాట్లాడొద్దని కోటంరెడ్డికి తేల్చి చెప్పారు.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (facebook)

Nellore Politics ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బహిరంగ విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ క్లాస్ తీసుకున్నారు. పార్టీ జిల్లా వ్యవహారాల పరిశీలకుడు బాలినేనితో కలిసి కోటంరెడ్డి ముఖ్యమంత్రితో గంటకు పైగా భేటీ అయ్యారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రికి కోటంరెడ్డి ఏకరవు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డిలు ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుండటంతో ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తోంది. దీంతో కోటంరెడ్డిని తాడేపల్లి పిలిపించి ముఖ్యమంత్రి మాట్లాడారు. దాదాపు గంటకుపైగా ముఖ్యమంత్రి కోటంరెడ్డితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో పార్టీ పరువు తీసేలా బహిరంగంగా మాట్లాడొద్దని తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రితో భేటీ తర్వాత కోటంరెడ్డి తాను పార్టీకి ప్రయోజనాలు దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై మాత్రమే మాట్లాడానని చెప్పారు. గడపగడపకు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని, తాను కూడా వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే గడపగడపకు కార్యక్రమంలో వెనుకబడినట్లు చెప్పారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా పనితీరు మెరుగ్గానే ఉన్నా, గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి వెనుకబడిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసే కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే చేపట్టాల్సిందేనని సిఎం తేల్చి చెప్పారు. నెల్లూరులో పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని తేల్చి చెప్పారు. కోటంరెడ్డికి ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో జిల్లాలో అభివృద్ది విషయంలో మంత్రితో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు అందరిని కలుపుకుని వెళ్లాలని సూచించారు. పార్టీలో సమస్యలు తలెత్తితే బాలినేని శ్రీనివాసరెడ్డితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ మట్టికరిపించినట్లే మళ్లీ విజయకేతనం ఎగురవేయాలని ఆదేశించారు. నెల్లూరులో గత కొన్ని రోజులుగా ఇద్దరు కీలక నేతలు బహిరంగ విమర్శలు చేస్తుండటంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. కోటంరెడ్డిని సముదాయించిన ముఖ్యమంత్రి త్వరలో ఆనం రాంనారాయణరెడ్డితో కూడా భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్లు పూర్తైనా ప్రజలకు ఏమి చేశామో చెప్పుకునే పరిస్థితి లేదంటూ ఇటీవల ఆనం వ్యాఖ్యనించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తుండటానికి కారణాలను సిఎం అన్వేషిస్తున్నారు. వ్యక్తిగత అసంతృప్తులు, పదవులు దక్కకపోవడం, పనులు కాకపోవడం వంటి కారణాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఎదురవుతుండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి కోటంరెడ్డికి హితవు పలికారు. తాను ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అధికారుల తీరునే తప్పు పట్టినట్లు కోటంరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు ఆనంతో కూడా త్వరలో ముఖ్యమంత్రి భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆనం తీరుపై జిల్లా వైసీపీ సమన్వయకర్త బాలినేనితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారు. ఆనం గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని తప్పుట్టేలా బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆనంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

IPL_Entry_Point