Vizag Capital : విశా‌ఖ వెళ్లిపోతున్నాం….. ఏపీ సిఎం జగన్…-ap cm comments on visakha capital and said himself shifting over to visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ap Cm Comments On Visakha Capital And Said Himself Shifting Over To Visakhapatnam

Vizag Capital : విశా‌ఖ వెళ్లిపోతున్నాం….. ఏపీ సిఎం జగన్…

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 02:03 PM IST

Vizag Capital ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సన్నాహాక సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖపట్నం రాజధాని కాబోతుందని, తాను కూడా రానున్న కొద్ది నెలల్లో విశాఖ నుంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. రాజధాని వికేంద్రీకరణ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలో ము‌ఖ్యమంత్రి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. వివాదాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉగాది నాటికి విశాఖ తరలిస్తారనే విస్తృత ప్రచారం నేపథ్యంలో సిఎం వ్యాఖ‌్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

Vizag Capital ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా రాజధాని విశాఖకు మారనుందని, తాను కూడా ఇకపై అక్కడి నుంచే పరిపాలన చేపడతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పిన జగన్, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్లోబల్‌ సమ్మిట్‌ సన్నాహాక సదస్సులో పాల్గొన్న సిఎం జగన్, వివిధ దేశాల దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

"Here iam to invite you to Visakhapatnam which is going to be our capital, in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well". అంటూ తన మనసులో మాటను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని ప్రకటించారు. మార్చిలో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌కు రావాలని ముఖ‌్యమంత్రి ఆహ్వానించారు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌‌ సన్నాహాక సదస్సుల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌ను ఘనంగా నిలిపేందుకు పెట్టుబడుల సహకారం అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు తరలి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సిఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా నంబర్ వన్ స్థానంలో ఉంటోందని ముఖ్యమంత్రి తెలియచేశారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితుల్ని సిఎం ఇన్వెస్టర్లకు వివరించారు.

పారిశ్రామిక వేత్తల ఫీడ్‌ బ్యాక్‌లో ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, సుదీర్ఘ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, 11.43 శాతం వృద్ధి రేటుతో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మూడు ఏపీకి రావడం శుభపరిణామమని, సింగల్ డెస్క్ సిస్టం ద్వారా ఏపీలో 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం పాల్గొన్నారు. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు.

ఏపీ అడ్వాంటేజ్‌..

ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్ , బిజినెస్-టు-గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన 13 కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్ సెషన్‌లను ప్లాన్ నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు.

ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు.

ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు తదితర అంశాలను పెట్టుబడిదారులకు వివరించారు. ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా,ముంబై నగరాల్లో రోడ్డు షోలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది.

WhatsApp channel

టాపిక్