CBN On Amit Shah: అమిత్ షాను చూస్తే అసూయగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే….
CBN On Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను చూస్తే తనకు అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భవనాల ప్రారంభంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
CBN On Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పనితీరు చూస్తే అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యనించారు. భారతదేశంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్‌షా పట్టుదలతో పని చేస్తున్నారని శాంతి భద్రతలు కాపాడటంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారని నేను చాలామంది హోంమంత్రులను చూశాను కానీ... ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నా అన్నారు.
2018లో ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయిన తర్వాత గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ మధ్య తిరిగి జట్టు కుదిరింది. 2019-24 మధ్య బీజేపీకి దూరం కావడంతో వల్ల రాజకీయంగా నష్టపోయామని భావించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పార్టీతో బంధాన్ని పదిలం చేసుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ క్రమంలో అమిత్ షాపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాలపై రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో అమిత్‌షాను చంద్రబాబు బహిరంగంగా పొగడ్తలతో ముంచెత్తారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఏమన్నారంటే… “అవసరమైన సాంకేతికత వినియోగించుకోవడం, నియామకాలు చేపట్టడమొక్కటే కాకుండా విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. దేశంలో ఏ మూలాన ఆపదలో ఉన్నా వారి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో అమితాషా ఉన్నారు.” అని వివరించారు.
"దేశంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా సమర్థవంతంగా పని చేసి చక్కదిద్దుతున్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. సమర్ధతతో పని చేస్తున్న అమిత్ షా పనితీరును చూస్తే కొన్నికొన్ని సార్లు నాకు అసూయ కలుగుతుంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమిత్ షా మనిషిలా కాకుండా మిషన్‌లా పని చేస్తున్నారని చాలా మంది నేతలు రిబ్బన్‌లు కట్ చేసి ప్రసంగించి వెళ్లిపోతారని అమిత్‌షా మాత్రం ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా వివరాలు తెలుసుకుంటారన్నారు. అమిత్‌షాతో నేను ఎప్పుడు సమావేశమైనా వినూత్నమైన తన ఆలోచనలను పంచుకుంటారని చెప్పారు.
ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ చాలా విధ్వంసానికి గురైంది, ఎప్పటిలాగా కాకుండా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని తనకు సలహా ఇచ్చారని దీనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. వినూత్నంగా ఆలోచిస్తేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్‌ను ప్రధాని మోదీ విడుదల చేశారు. టెక్నాలజీపైనా ఫోకస్ పెట్టడంతో పాటు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ గురించి అమిత్ షా చెప్పారు. 2047 నాటికి నెంబర్ వన్ స్థానంలో మన దేశం ఉంటుంది...దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.