PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీ ఇస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు
PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ ఇస్తామని ప్రకటించారుర.

PM Suryaghar: ఏపీలో పీఎం సూర్యఘర్ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు.
పీఎం సూర్యఘర్ లో 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చు అవుతుండగా కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 వేలు అదనంగా రాయితీ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందనుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ప్లాంట్లు…
గృహ విద్యుత్ వినియోగంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే పిఎం సూర్య ఘర్ యోజన పథకంలో కీలక మార్పులకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 200యూనిట్లలోపు విద్యుత్ వినియోగాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్ స్థానంలో సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టలేషన్‌లను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ పోర్టల్ ద్వారా ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ కింద 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 77.09 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 6.5 వేల ఇన్‌స్టలేషన్లు పూర్తయ్యాయి. మొత్తం లోడ్ 24,339 కిలోవాట్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలో వాట్ కు రూ.30 వేలు, రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు రాయితీ చెల్లించారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు మరియు ఇన్‌స్టలేషన్లు పెరిగేలా చూడాలని ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ సూచించారుే.
ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ కింద రూ.10.88 కోట్లు, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్ కింద రూ.7.74 కోట్లు, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ కింద 6,77,146 మంది, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్ కింద 5,9,587 మంది, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు. వీరితో సోలార్ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.
సంబంధిత కథనం