AP Civils Aspirant Died : దిల్లీలో ఏపీకి చెందిన సివిల్స్ అభ్యర్థి మృతి, ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కారణమని ఆరోపణలు
AP Civils Aspirant Died : ఏపీకి చెందిన సివిల్స్ అభ్యర్థి దిల్లీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తమ కుమారుడి మృతి ఆన్ లైన్ బెట్టింగ్ ముఠానే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
AP Civils Aspirant Died : దిల్లీలో ఏపీకి చెందిన సివిల్స్ అభ్యర్థి మృతి చెందారు. ఆయన మృతికి ఆన్‌లైన్ బెట్టింగే కారమణమని భావిస్తున్నారు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు దిల్లీకి బయలుదేరారు. బెట్టింగ్ ముఠా తమ కుమారుడి ప్రాణాలు తీసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కెనమాకులపల్లి పంచాయతీలోని వెంకటేపల్లికి చెందిన హరీష్ కుమారుడు సునీల్ దిల్లీలో సివిల్స్ కోచింగ్‌కు వెళ్లాడు. అక్కడే పెయింగ్ గెస్ట్ (పీజీ)లో ఉంటూ చదువుకుంటున్నాడు. దిల్లీలో ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో సివిల్స్ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే సునీల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడని సమాచారం. దాదాపు రూ.4 లక్షలు అప్పు అయ్యాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి రూ.2 లక్షలు పంపించారు.
అయితే సునీల్ అనారోగ్యంతో ఉన్నాడని సోమవారం పీజీ నిర్వాహకులు నుంచి సునీల్ తండ్రికి ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం దిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఆ తరువాత మళ్లీ మీ అబ్బాయి మృతి చెందాడని తెలిపారు. మృతి చెందిన సునీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. దిల్లీకి చేరుకున్న కుటుంబ సభ్యులు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ మర్చురీలో కుమారుడి మృత దేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. బంధువులు రోదనలు మిన్నంటాయి.
ఈ క్రమంలో మృతదేహాన్ని చూసిన మృతుడి తండ్రి హారీష్ మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని హత్య చేశారని, మృతదేహంపై గాయాలున్నాయని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతుడు సునీల్ ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు అప్పులు చేశాడని, దీంతో కుటుంబ సభ్యులు గతవారమే రూ.2 లక్షలు సునీల్‌కు పంపారని బంధువులు తెలిపారు. మిగిలిన రూ.2 లక్షల కోసం బెట్టింగ్ ముఠా సునీల్ ప్రాణాలు తీసి ఉంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం