AP CID : తెరపైకి ‘రెడ్ బుక్’ అంశం.. నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీసులు
AP CID Notice to Lokesh : నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. రెడ్‌బుక్ పేరుతో అధికారులను… లోకేశ్ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.

AP CID Notice to Lokesh: రెడ్ బుక్ వ్యాఖ్యలపై నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సీఐడీ అధికారులు… కోర్టు సూచనల మేరకు లోకేశ్ కు నోటీసులు పంపారు. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపగా అందినట్లు లోకేశ్ సమాధానం ఇచ్చారు.
నారా లోకేశ్ ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇచ్చిన 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే లోకేశ్ చేసిన రెడ్ బుక్ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది సీఐడీ. చంద్రబాబు కేసుకు సంబంధించి రెడ్‌బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను లోకేశ్ బెదిరించే విధంగా వ్యవహరించారని తెలిపిన సీఐడీ.. దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామని చేసిన ప్రకటనలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రెడ్‌బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనను సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే లోకేశ్ పేరును నమోదు చేసింది సీఐడీ. హైకోర్టు ఆదేశాలతో 41ఏ నోటీసులను కూడా జారీ చేసింది. అయితే ఇందులో పేర్కొన్న నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని కొత్తగా వేసిన పిటిషన్ లో ప్రధానంగా ప్రస్తావించింది. దీనిపై వాదనలు విన్న కోర్టు… లోకేశ్ కు నోటీసులు ఇవ్వాలని సూచించింది.
కోర్టు సూచనల ప్రకారం… లోకేశ్ కు నోటీసులు ఇవ్వడానికి డిసెంబర్ 28వ తేదీన సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో ఉండకపోవటంతో… ఇవాళ వాట్సాప్ లో పంపించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలను జనవరి 9వ తేదీన కొనసాగనున్నాయి.