Amaravati Assigned Lands Scam : నారాయణ విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు
Amaravati Assigned Lands Scam : నారాయణ విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసుకు సంబంధించి ఆరా తీసిన అధికారులు… కీలక సమాచారం సేకరించామని వెల్లడించారు.
Amaravati Assigned Lands Scam : అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసు విచారణలో ఏపీ సీఐడీ మళ్లీ దూకుడు పెంచింది. ఈ కేసుకి సంబంధించి మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల కార్యాలయాల్లో సీఐడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో నారాయణకి చెందిన ఎన్ స్పైరా (Nspira) సంస్థలో 22 మంది సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా... అమరావతి ఓఆర్ఆర్ కి సంబంధించిన వివరాలను సీఐడీ అడిగినట్లు సమాచారం. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధులు మళ్లించారని... ఆ డబ్బుతో నారాయణ, బినామీల పేర్లపై అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీ పేర్కొంది. ఇందులో మాజీ మంత్రి నారాయణతో పాటు కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని సీఐడీ చెబుతోంది.
రూ. 5,600 కోట్ల విలువైన 1400 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్నది సీఐడీ అభియోగం. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ.. బంధువులు, స్నేహితుల పేర్లతో బినామీ లావాదేవీలు జరిపారని పేర్కొంది. రాజధాని వస్తే.. ప్రభుత్వం భూములు తీసుకుంటుందని నమ్మబలికి... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారని ఆరోపించింది. వెలగపూడి, రాయపూడి, ఉద్ధండరాయునిపాలెం తదితర గ్రామాల్లో బినామీల పేరిట భూములు కొనుగులు చేసి.. అధికారులపై రిజిస్ట్రేషన్ కోసం అప్పటి టీడీపీ మంత్రులు ఒత్తిడి చేశారంది. రాజధాని భూముల సమీకరణ కోసం అప్పటి ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేందుకే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అభియోగాలు మోపింది. ఈ తతంగం అంతా 2016లో జరిగిందని వెల్లడించింది. భూములు కొనుగోలు చేసిన వారందరూ మాజీ మంత్రి నారాయణకు చాలా దగ్గరి బంధువులు, పరిచయస్తులేనని స్పష్టం చేసింది.
నారాయణ విద్యా సంస్థలు.. నారాయణ లెర్నింగ్ ప్రైవేటు లిమిటెడ్, నారాయణ ట్రస్టు పేరుతో ఉన్న సంస్థలను 2014 నుంచి నిర్వహిస్తున్నారన్న సీఐడీ.. వాటిని మాజీ మంత్రి కుటుంబీకులు నిర్వహిస్తున్నారని అభియోగాల్లో పేర్కొంది. ఈ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధులు మళ్లించారని... అక్కడి నుంచి సంస్థ ఉద్యోగుల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసి.. వారి ఖాతాల నుంచి అసైన్డ్ భూముల రైతులకి చెల్లింపులు జరిపారంది. ఈ మేరకు నారాయణ దగ్గరి బంధవులు, పరిచయస్తులు.. రైతులతో కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారంది. ఇప్పటి వరకూ 150 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు గుర్తించామని... విచారణ కొనసాగుతున్న కొద్దీ మరిన్ని లావాదేవీలు వెలుగులోకి వస్తాయని పేర్కొంది. మోసపోయామని గుర్తించిన తర్వాత రైతులు న్యాయం కోసం అధికారులని ఆశ్రయించారని.. రాజధాని భూ సేకరణ కింద పేర్కొన్న ప్రయోజనాలను తమకూ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని సీఐడీ వివరించింది.
హైదరాబాద్ మాదాపూర్ లో నారాయణకి చెందిన ఎన్ స్పైరా (Nspira) సంస్థ డైరెక్టర్లుగా.. ఆయన కూతురు, అల్లుడు ఉన్నారని సీఐడీ పేర్కొంది. నారాయణ సంస్థల ఆర్థిక లావాదేవీలు మొత్తం ఈ సంస్థ నుంచే జరుగుతున్నాయని గుర్తించామని అభియోగాల్లో పేర్కొంది. అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుకి సంబంధించిన కీలక సమాచారం సేకరించామని వెల్లడించింది.