AP CID : చింతకాయల విజయ్‌ ఇంట్లో సిఐడి సోదాలు…-ap cid notices to chintakayala vijay for posters against cm wife bharati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ap Cid Notices To Chintakayala Vijay For Posters Against Cm Wife Bharati

AP CID : చింతకాయల విజయ్‌ ఇంట్లో సిఐడి సోదాలు…

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 07:55 AM IST

AP CID ముఖ్యమంత్రి సతీమణిపై అనుచిత పోస్టర్లు వేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం దుమారం రేపుతోంది. హైదరాబాదులోని చింతకాయల విజయ్ నివాసంలో సీఐడీ పోలీసులు బీభత్సం సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చింతకాయల విజయ్ కి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందో సిఐడి ప్రకటించింది. సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేస్తున్నందునే విజయ్ కి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేసింది.

భారతిపై దుష్ప్రచారం వెనుక ఐటీడీపీ ఉందని సిఐడి ఆరోపణ
భారతిపై దుష్ప్రచారం వెనుక ఐటీడీపీ ఉందని సిఐడి ఆరోపణ

AP CID తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు, టీడీపీ సామాజిక మాధ్యమ బాధ్యుడు చింతకాయల విజయ్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 'భారతి పే' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ హస్తం ఉందని ఏపీ సీఐడీ ఆరోపించింది. విజయ్‌కి నోటీసుల వ్యవహారంలో అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ట్రెండింగ్ వార్తలు

పోస్టర్ల వ్యవహారంలో ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని చింతకాయల విజయ్‌కు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఉన్న విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వచ్చారని, అపార్ట్‌మెంట్ వాచ్‌మాన్‌ను ఇంటి చిరునామా అడిగి అక్కడే ఉన్న విజయ్ కారు డ్రైవర్‌ను వెంట పెట్టుకొని సీఐడీ పోలీసులు విజయ్ ఇంట్లోకి వెళ్లినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేరని, సీఐడీ పోలీసులు ఇల్లు మొత్తం వీడియో తీశారని పనిమనిషి తెలిపారు. విజయ్ పెద్ద కుమార్తెను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోకి తీసుకెళ్లాలని తనపై చేయి చేసుకున్నారని విజయ్ కారు డ్రైవర్ చెప్పాడు. మరోవైపు ఓ కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే ఇంటికి వచ్చామని సీఐడీ అధికారి పెద్దిరాజు వెల్లడించారు. నోటీసులు ఇచ్చి వెళ్తున్న సమయంలో కొందరు టీడీపీ నేతలు విజయ్ ఇంటికి చేరుకుని సిఐడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తెదేపా యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులకు గురి చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని ధ్వజమెత్తారు.

ఏపీ సీఐడీ నిబంధనలు అతిక్రమిస్తోందని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లలు లేరా అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారని నిలదీశారు. ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారని స్పష్టం చేశారు. ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్న అయ్యన్న.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.

WhatsApp channel

టాపిక్