Margadarsi Case : మార్గదర్శి కేసులో సీఐడీ దూకుడు, రూ.793 కోట్ల ఆస్తులు అటాచ్!-ap cid attaching 793 crore margadarsi property in chit funds case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cid Attaching 793 Crore Margadarsi Property In Chit Funds Case

Margadarsi Case : మార్గదర్శి కేసులో సీఐడీ దూకుడు, రూ.793 కోట్ల ఆస్తులు అటాచ్!

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 09:09 PM IST

Margadarsi Case : మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ మరో కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థకు చెందిన రూ.793 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

మార్గదర్శి ఆస్తులు అటాచ్
మార్గదర్శి ఆస్తులు అటాచ్

Margadarsi Case : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవల మార్గదర్శి డైరెక్టర్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ ను విచారించిన సీఐడీ అధికారులు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిట్ ఫండ్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగిస్తూ... ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

చిట్స్ డబ్బు మ్యూచువల్ ఫండ్స్ కు మళ్లింపు

మార్గదర్శిలో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫోర్‌మెన్‌, ఆడిటర్లు చిట్ ఫండ్స్ సేకరణలో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ తెలిపింది. సేకరించిన చిట్స్ ను హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలోని 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీలో 1989 చిట్స్‌ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూప్‌లు ఉన్నాయి. అయితే ఖాతాదారులకు వెంటనే డబ్బు చెల్లించే స్థితిలో మార్గదర్శి సంస్థ లేదని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మళ్లించిందని సీఐడీ ఆరోపిస్తోంది.

ఆస్తులు అటాచ్

విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గదర్శి శాఖల్లో అక్రమాలు వెలుగుచూశాయని సీఐడీ తెలిపింది. మార్గదర్శి ఆడిటర్‌ కె. శ్రవణ్‌, ఈ శాఖల ఫోర్‌మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజ, ఛైర్మన్‌ రామోజీరావు కుట్ర పన్నారని, అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ పేర్కొంది. మార్గదర్శికి చెందిన 1989 యాక్టివ్ చిట్ గ్రూపులను ఆంధ్రప్రదేశ్‌లోని తన శాఖలలో రూ.50,000 నుంచి రూ.1 కోటి వరకు చిట్ విలువతో నిర్వహిస్తున్నట్లు CID తెలిపింది. మార్గదర్శి అటాచ్ చేసిన చరాస్తులపై నియంత్రణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్‌ను కోరింది. ఉత్తర్వులు సంపూర్ణంగా ఉండేలా సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సీఐడీని ఆదేశించింది.

ఆడిటర్ కు బెయిల్

మార్గదర్శి కేసులో ఆడిటర్‌ శ్రావణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. చందాదారులకు డిపాజిట్లు తిరిగి చెల్లించడంలో మార్గదర్శి సంస్థ విఫలమైందని ఫిర్యాదు చేయలేదని, రికార్డులు పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. డిపాజిటర్ల చట్టంలోని సెక్షన్‌ 5 కింద పిటిషనర్‌ నేరానికి పాల్పడినట్లు చెప్పలేమని తెలిపింది. ఇదేతరహా ఆరోపణలతో నమోదైన కేసుల్లో దర్యాప్తు అధికారి పిటిషనర్‌పై ఆరోపణలను పరిశీలించారని తెలిపింది. అన్నీ పరిశీలించిన తర్వాత ముందస్తు బెయిలు మంజూరు చేసేందుకు తగిన కేసు అని న్యాయమూర్తి అన్నారు.

మార్గదర్శి కేసు
మార్గదర్శి కేసు
మార్గదర్శి కేసు
మార్గదర్శి కేసు
IPL_Entry_Point