Margadarsi Case: మార్గదర్శికి మరోసారి ఏపీ సీఐడీ షాక్‌.. రూ. 242 కోట్ల ఆస్తుల జప్తు-ap cid attaches rs 242 crore in margadarsi chit fund case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Margadarsi Case: మార్గదర్శికి మరోసారి ఏపీ సీఐడీ షాక్‌.. రూ. 242 కోట్ల ఆస్తుల జప్తు

Margadarsi Case: మార్గదర్శికి మరోసారి ఏపీ సీఐడీ షాక్‌.. రూ. 242 కోట్ల ఆస్తుల జప్తు

Margadarshi Chit Fund: మార్గదర్శికి మరో షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ. రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసింది.

మార్గదర్శికి మరో భారీ షాక్‌

Margadarsi Chit Fund Case: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో దూకుడుగా ముందుకెళ్తోంది ఏపీ సీఐడీ. ఇప్పటికే పలు కేసులు నమోదు చేయటంతో కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది. తాజాగా రూ. 242 కోట్ల చరాస్తులను జప్తు చేసింది. ఈ మేరకు ఏపీ సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్‌) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి గత నెల చివర్లోనే మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను సీఐడీ ద్వారా అటాచ్‌ చేయించింది ఏపీ సర్కార్. మార్గదర్శికి సంబంధించిన రూ.793.50కోట్ల విలువైన చరాస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు ఏపీ హోంశాఖ ప్రకటించింది. ఈ కేసు తేలేవరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేకుండా చేసింది. ఇందులో సంస్థన్ చైర్మన్‌, ఎండీ, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్టు సీఐడీ తెలిపింది. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1989 చిట్స్‌ గ్రూపులు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపిన సీఐడీ, ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని తెలిపింది.

విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గదర్శి శాఖల్లో అక్రమాలు వెలుగుచూశాయని సీఐడీ తెలిపింది. మార్గదర్శికి చెందిన 1989 యాక్టివ్ చిట్ గ్రూపులను ఆంధ్రప్రదేశ్‌లోని తన శాఖలలో రూ.50,000 నుంచి రూ.1 కోటి వరకు చిట్ విలువతో నిర్వహిస్తున్నట్లు CID తెలిపింది. మార్గదర్శి అటాచ్ చేసిన చరాస్తులపై నియంత్రణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్‌ను కోరింది.

ఈ మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా రామోజీరావుతో పాటు శైలజాకిరణ్ ను కూడా విచారించారు అధికారులు. మార్గదర్శి మేనేజర్లను కూడా అరెస్టు చేశారు. మార్గదర్శి చైర్మన్‌ రామోజీ రావు, ఎండీ శైలజా కిరణ్‌ను నిందితులుగా చేర్చి కొద్దిరోజుల కిందటనే హైదరాబాద్‌లో ప్రశ్నించి స్టేట్‌ మెంట్స్‌ రికార్డు చేసింది.

సంబంధిత కథనం