నాలా చట్టం రద్దు…పైగా ట్యాక్స్ కూడా తగ్గింపు..! రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు-ap cabinet sub committee is working on repealing the nala act ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నాలా చట్టం రద్దు…పైగా ట్యాక్స్ కూడా తగ్గింపు..! రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు

నాలా చట్టం రద్దు…పైగా ట్యాక్స్ కూడా తగ్గింపు..! రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు

ఏపీ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. నాలా చట్టం రద్దుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ… లోతుగా అన్ని విషయాలను పరిశీలిస్తోంది. తుది ముసాయిదా ప్రతిపాదనల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్(కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం ఆదేశాలను జారీచేసింది.

వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు… మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఇదే విషయంతో పాటు రెవెన్యూ శాఖలో తీసుకురావాల్సిన అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది.

ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మూడోసారి భేటీ అయ్యింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ భేటి జరిగింది. ఇందులో అనగాని సత్యప్రసాద్ తోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సులభంగా భూమార్పిడి..!

ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజలు ట్యాక్స్ కట్టేస్తే ఆటోమేటిక్ గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రులు చెప్పారు. భూ మార్పిడి అత్యంత సులభంగా జరగాలని అభిప్రాయపడ్డారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఎలా చేయాలనే దానిపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాక్స్ తగ్గింపుపై కూడా…!

తదుపరి సమావేశంలో అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నిర్ణయించిన విధివిధానాలను మంత్రివర్గం ముందు పెడతామని మంత్రులు చెప్పారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ…. ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక నాలా ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉందని పలు సంఘాల నుండి అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఆ ట్యాక్స్ ను కూడా ఎంతమేరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీలైతే ఈ ప్రతిపాదనలను జూన్ 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చిస్తామని తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం