AP Cabinet Meeting : రేపే ఏపీ కేబినెట్ సమావేశం- ఫ్రీ బస్, అన్నదాత సుఖీభవ పథకాలపై చర్చించే అవకాశం
AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక పథకాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు పథకం, అన్నదాత సుఖీభవ అమలుతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఈ సమావేశంలో లో చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ అంశంపై కేబినెట్ సమావేశం అనంతరం చర్చించే అవకాశం ఉందని సమాచారం.

రేపటి కేబినెట్ సమావేశంలో పలు ఎన్నికల హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. పలు కంపెనీలకు భూములు కేటాయింపు, మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అంశంపై చర్చించే అవకాశం ఉంది. గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర ముఖ్య అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది.
రెండు నెలల్లో ఫ్రీ బస్ స్కీమ్
ఏపీలో మహిళలకు ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు ఉచిత బస్సు పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని గుడ్ న్యూస్ చెప్పారు. రేపు జరిగి కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. గురువారం నాయుడుపేటలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు.
మరో రెండు నెలల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 ఉచిత సిలిండర్లు, 64 లక్షల మందికి 30వ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి తెలిపారు. వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రోడ్డు, రవాణా శాఖ సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.