ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ-కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా మీడియాకు వివరించారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు... ఐదు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సిఫారసులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన, రోడ్లు, పారిశ్రామిక నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భూములను కేటాయించడం ద్వారా ఏపీలో ప్రాజెక్టుల స్థాపనను వేగవంతం చేసేందుకు ఈ ఆమోదం దోహదపడుతుంది.
ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.9,246 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశమే కాకుండా దాదాపు 7,766 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరో రెండు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.2,261 కోట్లు పెట్టుబడులకు రావడమే కాకుండా దాదాపు 2,125 మందికి ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లెదర్, ఫుట్వేర్ పాలసీ (4.0) 2024-30 ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో వెనక్కి తీసుకున్న 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం బీచ్ రోడ్లో తాజ్ గేట్ వే అభివృద్ధి కోసం 5-స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ గా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రూ.899 కోట్ల పెట్టుబడితో 1,300 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఏలూరు సమీపంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 అధ్యయన కేంద్రాలను నిర్వహించడానికి, విద్యార్థుల విస్తృత విద్యా ప్రయోజనాలకు ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీచేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం-1905 లోని 22-A నిషేదిత జాబితాలో ప్రభుత్వ/కేటాయించిన/ఎండోమెంట్స్/వక్ఫ్ భూముల చట్టవిరుద్ధ బదిలీని రద్దు చేయడం కోసం రెవెన్యూ/ఇతర అధికారులు అమలు చేసే రద్దు డీడ్లపై రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలకు మినహాయింపు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
వైఎస్ఆర్ జిల్లాలోని కె.బొమ్మెపల్లి గ్రామంలో 1000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు ఎకరానికి రూ.5,00,000 చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.2,09,95,000 అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
నెల్లూరు జిల్లా ముతుకు మండలం పైనాపురం గ్రామంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకర్గంలో రాజకీయ ఘర్షణలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు చట్ట నిబంధనలను సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేస్తూ, గతంలో మాదిరిగానే చౌక ధర దుకాణాల ద్వారా నేరుగా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని పునరుద్ధరించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
దీపం-2 పథకం మొదటి ఫేజ్ లో దాదాపు 99,700 మంది లబ్దిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని పొందారు. దీపం-2 ఫేజ్
2 అమల్లో భాగంగా ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. ఫేజ్-3లో ముందుగానే గ్యాస్ రాయితీ సొమ్మును లబ్దిదారులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.