AP Cabinet Decisions : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే-ap cabinet green signal for sc classification draft ordinance key decisions on crda ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. 59 షెడ్యూల్ ఉపకులాలలను వెనుకబాటుతనం, సామాజిక సమైక్యత ఆధారంగా మూడు సముదాయాలు విభజించినట్లు పేర్కొంది. సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణతో పాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ, సీఆర్డీఏ, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాలు వంటి 24 ప్రధాన అంశాలను కేబినెట్ చర్చించింది.

జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై కేబినెట్ లో పూర్తిస్థాయి చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపించారు. దీనిని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో పాటు సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ. 617 కోట్లు, హైకోర్టు నిర్మాణానికి రూ.786 కోట్లు, ఎల్‌ 1 బిడ్డర్‌లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందజేసేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారాన్ని ఇస్తూ కేబినెట్‌ నిర్ణయించింది. తీసుకున్నారు.

ఎస్సీ వర్గీకరణ- మూడు సముదాయాలు

"షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల మధ్య అంతరాలను తగ్గించుకునేందుకు, వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ ఉపకులాల ఏకీకృత, సమానమైన పురోగతి కోసం ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలలకు 1 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు"-మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

59 షెడ్యూల్ ఉపకులాలలను వెనుకబాటుతనం, సామాజిక సమైక్యత ఆధారంగా మూడు సముదాయాలు విభజించారు. మొదటి గ్రూప్ లో 12 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్, రెండో గ్రూప్ లో 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ , మూడో గ్రూప్ లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కేటాయించారు. ఏక సభ్య కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లకు 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తుంది. 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండో సైకిల్ అమలు చేస్తారు. అన్ని షెడ్యూల్ ఉపకులాలలకు విద్య, ఉద్యోగాల్లో సమానమైన న్యాయమైన ప్రవేశాల లభిస్తాయని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించగలమని ప్రభుత్వం భావిస్తుంది" - మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

ఈ నెల 26న మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఐటీ శాఖను బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో టీసీఎస్ విస్తరణకు భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

కేబినెట్ నిర్ణయాలు

  • విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం
  • ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాలు కేటాయింపు
  • బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కేబినెట్‌ ఆమోదం
  • పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం

డీఎస్సీ నోటిఫికేషన్‌

కేబినెట్ నిర్ణయాలును మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరిస్తూ... త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు రూ.20 వేలు ఖాతాల్లో వేస్తామన్నారు. భూగర్భ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గుంటూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గ్రేహౌండ్స్‌ విభాగానికి కొత్తవలసలో భూమి కేటాయిస్తామని తెలిపారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం