Viveka Murder Case : వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు.. ఏపీ కేబినెట్‌‌లో చర్చ.. కారణాలు ఏంటి?-ap cabinet discusses deaths of witnesses in ys vivekananda reddy murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case : వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు.. ఏపీ కేబినెట్‌‌లో చర్చ.. కారణాలు ఏంటి?

Viveka Murder Case : వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు.. ఏపీ కేబినెట్‌‌లో చర్చ.. కారణాలు ఏంటి?

Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా కేబినెట్‌‌ సమావేశంలో దీనిపై చర్చించారు. డీజీపీని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షుల మరణాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఇష్యూపై ఇప్పటికే సిట్‌ఏర్పాటు చేసింది. మరణించిన ఆరుగురు సాక్షులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా.. వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

డీజీపీని పిలిపించి..

వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్‌మన్‌ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 7వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను పిలిచించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో డీజీపీని కేబినెట్ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

చంద్రబాబు ఏమన్నారు..

రాజకీయం ముసుగులో కరడుగట్టిన నేరస్థులున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల్ని ఏమార్చేందుకు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు అరాచకాలు చేస్తున్నారని.. వాటిని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించినట్టు తెలిసింది. వివేకా హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆ రోజు ప్రసారం చేయడాన్ని చూసి.. తాను కూడా అదే జరిగిందని అనుకున్నానని చెప్పారు.

కేంద్రానికి నివేదిక..

సాక్షులంతా అనుమానాస్పదంగా మరణించడాన్ని తీవ్రంగా పరిగణించాలని.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నట్టు సమాచారం. ఆరుగురు సాక్షులు మరణించడానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సిట్‌ దర్యాప్తును వేగంగా పూర్తి చేయించాలని.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కేబినెట్ నిర్ణయించింది.

ఆరుగురు మృతి..

వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు, అనుమానితులైన కే.శ్రీనివాసులు రెడ్డి, డ్రైవర్‌ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్‌ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మన్‌ రంగన్నలు మృతి చెందారు. వారికి ఈ కేసుకు ఉన్న సంబంధం గురించి డీజీపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించినట్టు తెలిసింది. ఈ మరణాలన్నింటిపై విచారణ చేయిస్తున్నామని డీజీపీ చెప్పినట్టు తెలుస్తోంది.

హత్య కేసు వివరాలు..

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 15న జరిగింది.

ఆయనది సహజ మరణం కాదని, హత్య అని పోలీసులు తేల్చారు.

ఈ కేసును మొదట ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది.

తరువాత, ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురపై ఆరోపణలు ఉన్నాయి.

నిందితులంతా తమపై మోపిన అభియోగాలను తప్పుబట్టారు.

ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోయారు.

శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ అనే నలుగురు వేర్వేరు కారణాలతో చనిపోయారు.

దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందించారు.

వారి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.