ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా..! యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే-ap cabinet decides to provide health insurance to all citizens full details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా..! యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా..! యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. తద్వారా రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమాను కల్పించనుంది.

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందిస్తారు.

6 గంటల్లోనే అనుమతులు…!

ఈ విధానం ద్వారా రాష్ట్రంలో కోటి 63 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. 6 గంటల్లోనే వైద్య చికిత్స అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ అందుబాటులోకి తీసుకువస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్ ఉంటాయి. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది. మొత్తం 2,493 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్‌ వైద్యసేవ హైబ్రిడ్‌ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా అధికారులు కఠినంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలకొల్లు, అమలాపురం,ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్లలో ఈ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. హోంమంత్రి, పౌరసరఫరాల, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రులు ఇందులో ఉండనున్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం నివారణకు చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం