AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతోంది. దాదాపు రూ.3.24లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని కరవు , మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు చేసినట్టు సమాచారం.
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశ పెడతారు. రూ.3.24 లక్షల కోట్లతో ఈ ఏడాది బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది.
గత జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువును తొలుత మూడు నెలలు పొడిగించారు. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత నవంబరులో రూ.2.94 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రకటించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ అంచనాలతో తాజా బడ్జెట్ రూపకల్పన చేశారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు తాజాగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ‘సూపర్ సిక్స్’ లో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు మిగిలిన వాటికి కేటాయింపులు చేసినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిబిటి పథకాలకు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అమలు చేసేలా అంచనాలు రూపొందించినట్టు తెలుస్తోంది. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇచ్చే లక్ష్యం నెరవేరేలా నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమరావతి, పోలవరంతోపాటు... వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెడతారు. మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడ తారు. వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీలో అచ్చెన్నా యుడు, మండలిలో నారాయణ ప్రవేశ పెడతారు.
తాజా బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించ నున్నారు. వ్యవసాయరంగంలో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అవసరమైన సామగ్రి అందించేందుకు సిద్ధమవుతోంది. చిన్నసన్నకారు రైతులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో ప్రత్యేకనిధి ఏర్పాటు చేస్తారు. వైద్యరంగా నికి కేంద్రం నుంచి కొన్ని పథకాల వారీగా సాయం ప్రకటించనున్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలకు 40% రాష్ట్ర వాటా నిధులు కేటాయించనున్నారు. ఆ పథకాలు అమలైతే జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో పాటు స్వయం ఉపాధి పథకాలు, వాటిలో రాయితీలు, యూనిట్ల స్థాపనకు వీలుకల్పించే కార్య| క్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20వేల ఆర్ధిక సాయం అందించేలా నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ పథకంలో కేంద్రం రూ. 6వేలు ఇస్తే రాష్ట్రప్రభుత్వం రూ.14వేల వరకు ఇస్తోంది. దీపం పథకంలో మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. రాబోయే ఆర్థిక సంవత్స రంలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు నిధులు కేటాయిస్తారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ పూర్తైన తర్వాత వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఏపీలో పూర్తిస్థాయి ‘ఈ-బడ్జెట్’ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది మంత్రులకు ‘ట్యాబ్’లలోనే బడ్జెట్‌ను లోడ్ చేసిఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియాకు పెన్ డ్రైవ్ రూపంలో అందిస్తారు. సభలో బడ్జెట్ చదివే సమయంలో సభ్యులు చూసుకునేందుకు వీలుగా ప్రసంగం పుస్తకాన్ని మాత్రమే ముద్రించి అందించనున్నారు. గతంలో బడ్జెట్ సమయంలో 28 రకాల పుస్తకాలు ముద్రించేవారు. బడ్జెట్ పుస్తకాల ఖర్చు తడిచి మోపుడవుతుండటంతో ఆ విధానానికి స్వస్థి పలికారు.
సంబంధిత కథనం