BJP Comments on Gaddar : గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
BJP Comments on Gaddar : ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై.. తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌లతో పోల్చారు. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గద్దర్ మావోయిస్టులకు చెందిన నాయకుడని.. ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీని చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బండి సంజయ్ కూడా..
ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను, ఎన్ కౌంటర్లలో పోలీసులను పొట్టన బెట్టుకున్న వ్యక్తి గద్దర్ అని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయిస్టుగా పని చేసి ఎంతో మంది ప్రాణాలు తీసిన వారిలో గద్దర్ ఒకరని.. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు.
ఈటల నక్సలైట్ కాదు..
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నక్సలైట్ కాదన్నారు. మావోయిస్టు భావజాలం వేరు.. నక్సలైట్‌గా పని చేయడం వేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. నక్సలిజంతో ఎంపీ ఈటల రాజేందర్‌కు ఎలాంటి సంబంధం లేదనన్నారు. నంది అవార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న గద్దర్ అవార్డులను తమవారు తీసుకోరని బండి సంజయ్ స్పష్టం చేశారు.
రేవంత్‌కు తెలియదు..
గద్దర్ కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలను హతమార్చారని.. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గద్దర్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని.. తన దిష్టి బొమ్మ తగలబెడితే.. ఆయుష్షు పెరుగుతుందని స్పష్టం చేశారు. బండి సంజయ్.
క్షమాపణలు చెప్పాలి..
బండి సంజయ్ తాజాగా గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ఆయన కుటుంబానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని.. కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తర్వాతైనా గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని కోరారు.
గద్దర్ అవార్డులు..
గద్దర్ జయంతి ఉత్సవాన్నిఈ నెల31న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు.. ఆయన కుమారుడు సూర్యకిరణ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని వివరించారు.