BJP On Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా తెలుగు దేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్‌కు బీజేపీ కూడా మద్దతు ఇచ్చినట్లుగా బిజెపి లెటర్ హెడ్‌పై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరుతో లేఖ విడుదలైంది. బీజేపీ శ్రేణులు కూడా ధర్నాలలో పాల్గొనాలని, చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని అందులో పేర్కొన్నారు.
టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు ప్రకటించడం తొలుత నిజమేనని అంతా భావించారు. ఆ తర్వాత కాసేపటికే పురంధేశ్వరి ఖండన విడుదల చేశారు. బంద్‌కు తాను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్స్ ప్ గ్రూప్ లలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించింది. శనివారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన వెంటనే దానిని పురందేశ్వరి ఖండించారు. పురందేశ్వరితో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు నిజమేనని అంతా భావించారు. అనూహ్యంగా తమకు టీడీపీ బంద్‌కు సంబంధం లేదని బీజేపీ అధ్యక్షురాలు ప్రకటించడంతో ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
ఏపీలో బీజేపీతో ఎన్నికల పొత్తు కోసం కొంత కాలంగా టీడీపీ ప్రయత్నిస్తోంది.మరోవైపు జనసేన సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే సంఘీభావంగా హుటాహుటిన పవన్ కళ్యాణ విజయవాడ బయల్దేరి వచ్చారు. ప్రత్యేక విమానానికి అనుమతులు రాకపోవడంతో రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చారు. హైడ్రామా మధ్య పవన్ విజయవాడ చేరుకోవాల్సి వచ్చింది. టీడీపీ బంద్‌కు తాము కూడా మద్దతిస్తున్నట్లు పవన్ ప్రకటించారు.
అయితే బీజేపీతో వైసీపీకిఎలాంటి రాజకీయ పొత్తు లేదు. బీజేపీ-వైసీపీల మధ్య ఎలాంటి వైరం లేకపోయినా రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తామని తరచూ ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే కేంద్రంలో బీజేపీ అగ్రనేతలతో వైసీపీకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా నేరుగా బీజేపీ అగ్రనేతలతో వైసీపీ వ్యవహారాలు నెరుపుతుంది. ఈ క్రమంలో టీడీపీ బంద్‌కు మద్దతిచ్చే విషయంలో రాష్ట్ర పార్టీకి బ్రేకులు పడినట్టు ప్రచారం జరుగుతోంది.