AP Assembly Sessions : ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ఈసారి సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!-ap assembly sessions will start from 11th november 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Sessions : ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ఈసారి సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!

AP Assembly Sessions : ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ఈసారి సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 03, 2024 07:37 AM IST

AP Assembly Budget Sessions 2024 : ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.

తాజాగా ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా… పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 11వ తేదీన లేదా మరునాడు వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు పది రోజులకుపైగా జరిగే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడంతో పాటు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకూ ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలోనే… పూర్తిస్థాయి బడ్జెట్ కు సర్కార్ సిద్ధమైంది.

నిజానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. అందుకు అనుగుణంగానే రెండోసారి కూడా ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

చివరిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పలు కీలక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆర్థిక పరిస్థితి, మద్యం, శాంతి భద్రతలపై వివరాలను సభ ముందుకు ఉంచింది. గత సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతారని భావించినప్పటికీ… ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించింది. ఈ గడువు ఈనెల చివరితో పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరగబోయే సమావేశల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది.

ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు కీలక అంశాలు సభలో చర్చకు అవకాశం ఉంది. సూపర్ సిక్స్ లోని స్కీమ్ ల అమలు, నూతన మద్యం పాలసీ, ఉచిత ఇసుక సరఫరాపై చర్చ జరగనుంది. అంతేకాకుండా… మరికొన్ని కొత్త స్కీమ్ ల అమలుపై కూడా సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

నవంబర్ 6న కేబినెట్ భేటీ:

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో నవంబర్‌ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ పై లోతుగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా… సభ ముందుకు తీసుకురావాల్సిన అంశాలు చర్చకు రానున్నాయి.

Whats_app_banner