AP Assembly Budget Session 2025 : ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly Budget Session 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఏపీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించనున్నారు.
బడ్జెట్ ఏ రోజంటే..?
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దును ఫిబ్రవరి 28వ తేదీన సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే రోజు మండలిలో కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్దెట్ సమావేశాలు ఎన్నిరోజుల పాటు నిర్వహిస్తారనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే ఈ సమావేశాలను మూడు వారాల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
2025 - 26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఏడాదిలో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. ఆ తర్వాత గతేడాది నవంబర్ లో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అవుతోంది. ఇందుకు సంంబధించి తేదీ ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ పై లోతుగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి జరగబోయే సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా..? లేక గతంలో మాదిరిగానే దూరంగా ఉంటారా..? అనేది చూడాలి…!
సంబంధిత కథనం