AP weather alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఈ జిల్లాలకు అలెర్ట్
AP weather alert: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో.. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచించారు.
విజయవాడలో భారీ వర్షం..
శుక్రవారం రాత్రి విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో బెజవాడ అల్లకల్లోలంగా మారింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో.. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి నెలకొంది. నగరంలో చాలాచోట్ల మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లాయి. రోడ్లపై ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు అయోమయానికి గురయ్యారు. వర్షం కారణంగా చాలాచోట్ల ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
భారీగా ట్రాఫిక్ జామ్..
భారీ వర్షం కారణంగా విజయవాడలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డులో ఉన్న జంక్షన్ వద్ద వహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వర్షం కురవడంతో కనీసం రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉన్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
గుంటూరులోనూ అదే పరిస్థితి..
గుంటూరు నగరంలోనూ శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు దంచికొట్టింది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు నీటితో నిండిపోయాయి. పాత గుంటూరు ప్రాంతంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరంలో చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గుంటూరు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అత్యధికంగా ఫిరంగిపురంలో..
గుంటూరు రూరల్ ఏరియాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ఫిరంగిపురంలో 93.25 మిల్లీమీటర్లు, తుళ్లూరులో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏరియాల్లో సైడు కాలువలు పొంగి రోడ్ల పైకి ప్రవహించడంతో.. పలు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో అపార్టుమెంట్ల వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది.