AP Rains Alert : ఏపీకి మరో తుపాను ముప్పు, రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం- రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP Rains Alert : రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
అనంతరం తుపాను వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24వ తేదీ ఉదయానికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తుపాను ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
అక్టోబర్ 21న ఈ జిల్లాల్లో వర్షాలు
ఆవర్తనం ప్రభావతం రేపు(సోమవారం) అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.