ఈ నెల 16న తిరుమలలో 'ఆణివార ఆస్థానం' - ఈ తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు-annual anivara asthanam will be observed in tirumala temple on july 16 details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఈ నెల 16న తిరుమలలో 'ఆణివార ఆస్థానం' - ఈ తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ నెల 16న తిరుమలలో 'ఆణివార ఆస్థానం' - ఈ తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఉంటుందని ప్రకటించింది. 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

తిరుమల శ్రీవారి ఆలయం

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుందని తెలిపింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

బ్రేక్ దర్శనాలు రద్దు….

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కార్యక్రమాల కారణం… రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జూలై 14, 15వ తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వివరించిందియ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించవలసినదిగా భక్తులను కోరింది.

చారిత్రక నేపథ్యం ….

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఉత్సవ విశిష్టత….

ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.

ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.