Annavaram Giri Pradakshina : న‌వంబ‌ర్ 15న అన్నవ‌రం స‌త్యదేవుని గిరి ప్రద‌క్షిణ‌, మధ్యాహ్నం 2 గంటలకు పుష్పర‌థం ప్రారంభం-annavaram giri pradakshina on nov 15th satyadeva chariot starts on afternoon 2 pm ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Annavaram Giri Pradakshina : న‌వంబ‌ర్ 15న అన్నవ‌రం స‌త్యదేవుని గిరి ప్రద‌క్షిణ‌, మధ్యాహ్నం 2 గంటలకు పుష్పర‌థం ప్రారంభం

Annavaram Giri Pradakshina : న‌వంబ‌ర్ 15న అన్నవ‌రం స‌త్యదేవుని గిరి ప్రద‌క్షిణ‌, మధ్యాహ్నం 2 గంటలకు పుష్పర‌థం ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Nov 10, 2024 07:26 PM IST

Annavaram Giri Pradakshina : కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న అన్నవరంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ర‌త్న, స‌త్యగిరుల చుట్టూ 8.4 కిలో మీట‌ర్ల మేర ప్రదక్షిణ సాగనుంది. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

న‌వంబ‌ర్ 15న అన్నవ‌రం స‌త్యదేవుని గిరి ప్రద‌క్షిణ‌, మధ్యాహ్నం 2 గంటలకు పుష్పర‌థం ప్రారంభం
న‌వంబ‌ర్ 15న అన్నవ‌రం స‌త్యదేవుని గిరి ప్రద‌క్షిణ‌, మధ్యాహ్నం 2 గంటలకు పుష్పర‌థం ప్రారంభం

కార్తీక పౌర్ణమి పుర‌స్కరించుకుని న‌వంబ‌ర్ 15న అన్నవ‌రం స‌త్యదేవుని గిరి ప్రద‌క్షిణ నిర్వహించనున్నారు. ఈ గిరి ప్రద‌క్షిణ‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున ర‌త్న, స‌త్యగిరుల చుట్టూ 8.4 కిలో మీట‌ర్ల మేర సాగే ప్రద‌క్షిణ‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌తోపాటు దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి ల‌క్ష్మలాది మంది భ‌క్తులు పాల్గొంటారు. ద‌ర్శనం, వ్రతాల‌కు తీవ్ర ర‌ద్దీగా ఉంటుంది.

న‌వంబ‌ర్ 15 ఉద‌యం 8 గంట‌ల‌కు కొండ దిగువున తొలిపావంచాల వ‌ద్ద స‌త్యర‌థానికి పూజ‌లు చేసి ప్రద‌క్షిణ ప్రారంభిస్తుంటారు. ఇదే స‌మ‌యానికి భ‌క్తులు వేలాదిగా పాల్గొంటున్నారు. దీంతో నియంత్రణ, సౌక‌ర్యాల విష‌యంలో ఇబ్బందులు వ‌స్తున్నాయి. దీంతో ఈసారి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు స‌త్యర‌థాన్ని ప్రారంభిస్తారు. వైదిక కార్యక్రమాల‌న్నీ తొలుత నిర్వహించి ఆ త‌రువాత ర‌థాన్ని ప్రారంభిస్తే ఉద‌యం నుంచే భ‌క్తులు గిరిప్రద‌క్షిణ‌లో ఉంటారు. త‌ద్వారా కొండ దిగువ‌న‌, పైన ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సింహాచ‌లం గిరి ప్రద‌క్షిణలో కూడా ప్రస్తుతం ఇదే ప‌ద్ధతిని అనుస‌రిస్తున్నారు. అక్కడ కొండ దిగువున తొలిపావంచాల వ‌ద్ద మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు అప్పన్న పుష్పర‌థాన్ని ప్రారంభిస్తారు. భ‌క్తులు ఉద‌యం నుంచే గిరిప్రద‌క్షిణ చేస్తుంటారు. అప్పుడు వైదిక కార్యక్రమాలు చేయ‌డానికి, భ‌క్తుల‌కు న‌డ‌క‌కి ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు. క‌నుక సింహాచ‌లంలో అనుస‌రించిన ప‌ద్ధతినే అన్నవ‌రంలో కూడా అనుస‌రించ‌నున్నారు.

గ‌తేడాది అన్నవ‌రంలో న‌వంబ‌ర్ 27న గిరి ప్రద‌క్షిణ జ‌రిగింది. రెండు ల‌క్షల మంది భక్తులు ఈ గిరిప్రద‌క్షిణ‌కు హాజ‌ర‌య్యారు. ఇదే స‌మ‌యంలో ద‌ర్శనానికి సుమారు 1.50 ల‌క్షల మంది భ‌క్తులు వ‌చ్చారు. వ్రతాలు కూడా 16 వేల వ‌ర‌కు జ‌ర‌గ‌డంతో కొండ‌పైన ప్రాంగ‌ణాలు కిక్కిరిసిపోయాయి. దీంతో ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

గ‌త అనుభ‌వాలు, ప్రద‌క్షిణ‌లో పాల్గొనే భ‌క్తుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఈ ద‌ఫా స‌మ‌స్యల‌కు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆల‌య ఈవో కె. రామ‌చంద్రమోహ‌న్ మాట్లాడుతూ కార్తిక పౌర్ణమి రోజున గిరి ప్రద‌క్షిణ‌, స‌త్యదేవుని ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల‌కు కొండ‌పైన‌, దిగువ‌న ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో స‌త్యర‌థాన్ని మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభించాల‌ని భావిస్తున్నామ‌ని తెలిపారు. దీంతో భ‌క్తుల‌కు సౌక‌ర్యవంతంగా ఏర్పాట్లు చేయ‌డానికి వీలుంటుంద‌ని అన్నారు.

చరిత్ర ఏం చెబుతోంది?

అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి త్రిమూర్తి రూపం. భక్త సులభుడిగా, కోర్కెలు నెరవేర్చే సత్యదేవుడిగా ఆయనపై అందరికీ అచంచల విశ్వాసం. ఏదైనా పని తలపెట్టినప్పుడు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే అనితర సాధ్యమైన మనోబలం సొంతమవుతుందని చెబుతారు. కార్తికమాసంలో త్రిమూర్తుల అభేదానుభవాన్నిచ్చే మీసాలరాయుని దర్శనం చాలా మంచిదని నమ్మకం. అన్నవరం రత్నగిరి ప్రదక్షిణ అత్యంత ప్రసిద్ధమైంది. అశేష భక్తకోటి కార్తిక పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ చేసి తరిస్తుంది. ఇలా చేయడం వల్ల కొండపై వెలసిన దేవతామూర్తుల శక్తిని పొందగలుగుతామని చెబుతారు. కొండంతా నిండిన అనేక ఔషధ వృక్షాలు సాధకుడికి ఆరోగ్యభాగ్యాన్నీ ఇస్తాయి. శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం, శక్తి, జ్ఞానం, ఆనందం ప్రదక్షిణతో లభిస్తాయి. అన్నవరం గిరి ప్రదక్షిణ అశ్వమేధ యాగ ఫలాన్నిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

మేరువు కుమారులైన భద్రుడు, రత్నాకరుడు మహావిష్ణువు అనుగ్రహంతో భద్రగిరి, రత్నగిరిగా మారినట్లు పురాణ కథనం చెబుతుంది. శ్రీమన్నారాయణుడు భద్రగిరిపై శ్రీరామచంద్రుడిగా, రత్నగిరిపై సత్యనారాయణ స్వామిగా అవతరించినట్లు చెబుతారు. సత్యదేవుని కొలువు సర్వదేవతా నిలయం. దిగువన స్వామి యంత్రం ఉంది. నలు దిక్కులా పంచాయతన దేవతలు కొలువుదీరారు. ఆగ్నేయాన గణపతి, నైరుతిలో సూర్యభగవానుడు, వాయువ్య దిశలో బాలాత్రిపుర సుందరీ అమ్మవారు, ఈశాన్యాన ఈశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ నేపథ్యంలో పంపాతీరాన సత్యదేవుని గిరి ప్రదక్షిణం త్రిమూర్తులకు చేసే ప్రదక్షిణగా చెబుతారు. సాక్షాత్తు ఆత్మ ప్రదక్షిణేనని భావిస్తారు.

ప్రదక్షిణ ఇలా

రత్నగిరి తొలి పావంచా నుంచి రత్నగిరి, సత్యగిరి చుడుతూ పంపా తీరం మీదుగా తొలి పావంచా వద్ద ముగిస్తే అదే ప్రదక్షిణ అవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో కొండపై ఉన్న ఉప ఆలయాల్లో కొలువైన క్షేత్ర రక్షకులు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు, క్షేత్రపాలకులు సీతారాములను ప్రదక్షిణం చేసిన ఆనందమూ భక్తులకు కలుగుతుంది. పావన పంపా సరోవరాన్ని, శిరసెత్తి చూసే గిరులు తరుల సౌందర్యాన్ని ఆస్వాదించినట్టు అవుతుంది. భూప్రదక్షిణ చేసినంత తృప్తి కలుగుతుంది. ముమ్మూర్తుల మేళవింపుగా దర్శనమిచ్చే రమా సత్యనారాయణుని స్వరూపం, ప్రదక్షిణ చేసిన సాధకుడిలో ఆత్మనిష్ఠను పెంపొందిస్తుంది. గిరి చుట్టూ తిరిగే హృదయం.. సత్యదేవుని నిలయం అవుతుందని భ‌క్తులు భావిస్తారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం