ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా అందిస్తున్న రూ.6 వేలు కలిపి అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా రూ.20 వేలు అందించనుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు...ఏడాదిలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
సీఎం చంద్రబాబు మే నెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రారంభిస్తామని ఇటీవల స్పష్టం చేశారు. మే 20లోపు జాబితాలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు.
ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేశారు. రైతులు మే 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది చెబుతున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్నదాత సుఖీభవ పథకం దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే పీఎం కిసాన్ డబ్బులు సైతం జూన్ నెలలో పడే అవకాశం ఉంది.
మే నెల 20లోగా రైతులు రైతు సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేసి పైస్థాయి అధికారులకు పంపిస్తారు.
జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్‌ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం మరోసారి ఈ వివరాలను ఆర్‌జీఎస్‌కు పంపుతారు.
.