నెల్లూరు గొడవలు ముగిసినట్టేనా....-anil kumar yadav compramise with kakani govardhan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Anil Kumar Yadav Compramise With Kakani Govardhan

నెల్లూరు గొడవలు ముగిసినట్టేనా....

HT Telugu Desk HT Telugu
Apr 26, 2022 06:45 PM IST

ముఖ్యమంత్రి కౌన్సిలింగ్ తర్వాత నెల్లూరు జిల్లా నేతల్లో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. నిన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఎట్టకేలకు కలుసుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారో లేదో కానీ అనిల్ కుమార్‌ యాదవ్ దూకుడు మాత్రం కాస్త తగ్గినట్టు కనిపించింది. ఉదయం రాజీ ధోరణి ప్రదర్శించిన అనిల్ సాయంత్రం మంత్రి కాకాణి ఇంటికి వెళ్లి మరీ కలిశారు.

మంత్రి కాకాణి గోవర్ధన్‌తో భేటీ అయిన అనిల్‌ కుమార్‌ యాదవ్
మంత్రి కాకాణి గోవర్ధన్‌తో భేటీ అయిన అనిల్‌ కుమార్‌ యాదవ్

నెల్లూరులో నిన్నటి వరకు హాట్‌హాట్‌గా సాగిన కాకాణి, అనిల్‌ కుమార్‌ వర్గాల వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. ఇరు వర్గాలు రోడ్డున పడి విమర్శలు చేస్తుండటంతో వారిని గాడిన పెట్టేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల అనిల్‌కుమార్‌ను, కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి పిలిచి క్లాస్‌ పీకడంతో దారికొచ్చినట్టే కనిపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

గత వారం ఆనం వర్గీయులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం మొదలైంది. అంతకుముందు ఆనం, వేమిరెడ్డి వర్గీయుల ఫ్లెక్సీలను కూడా అనిల్ ఆదేశాలతో తొలగించారు. రెండున్నరేళ్లుగా నగరంలో ఎలాంటి ఫ్లెక్సీలు కట్టడం లేదని అనిల్ సమర్ధించుకుంటూ వచ్చారు. దీంతో అనిల్ వ్యవహార శైలిపై మిగిలిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో రెండున్నరేళ్లుగా నెల్లూరు నగరంలో ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లేదని, కొత్తగా మళ్లీ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం సరికాదని చెబుతూ వచ్చిన అనిల్‌ కుమార్‌ మంగళవారం మాట మార్చేశారు. నగరంలో ఎవరు ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా తనకు ఏ అభ్యంతరం లేదని, ఇకపై ఎవరి వ్యవహారాల్లో తాను తలదూర్చనని ప్రకటించారు. సొంత పార్టీ వారే తనపై దుష్ప్రచారం చేశారని, అనవసర వివాదాల్లో తలదూర్చనంటూ ప్రకటించారు. స్థానిక 52వ డివిజన్‌లో పర్యటించిన సందర్భంగా అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అనిల్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తనపై విమర్శించారని ఆక్రోశం వ్యక్తం చేశారు.

నిజానికి నెల్లూరులో అనిల్‌ కుమార్‌తో కాకాణి, ఆనం, వేమిరెడ్డి వర్గాలకు సరిపడటం లేదు. మొదట్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి అనిల్‌‌తో సఖ్యత ఉన్నట్లు కనిపించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అనిల్‌ కుమార్‌ యాదవ్ ఒంటరి అయిపోయారు. జిల్లాలో అందరితో కలిసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పిన నేపథ్యంలో అనిల్ దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది.

ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంలో అనిల్‌ ఉద్దేశపూర్వకంగానే కాకాణి ఫ్లెక్సీలను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల తొలగింపు, కాకాణికి స్వాగతం పలుకుతూ ఆనం వర్గీయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వాటిని అనిల్ వర్గీయులు తొలగిస్తూ వచ్చారు. గతంలో తనకు సహకరించకపోవడంతో కాకాణికి మంత్రి పదవి దక్కడంతో దూకుడు ప్రదర్శించారు. 

మరోవైపు రాజకీయంగా ఒంటరయ్యే పరిస్థితి ఎదురవ్వడంతో అనిల్ వెనక్కి తగ్గినట్టు కనిపించింది. మంగళవారం సాయంత్రం ఇస్కాన్‌ కాలనీలో ఉన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి ముచ్చటించారు. అనిల్‌ కుమార్‌ మంత్రిగా ఉండగా మూడేళ్లలో ఒక్కసారిగా కూడా సర్వేపల్లిలో పర్యటించలేదు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి వెంకటగిరి వెళ్లి పోటీ చేస్తానని అనిల్ కుమార్‌ ముఖ్యమంత్రికి చెప్పడం వల్లే ఆయన మంత్రి పదవి కోల్పోయారనే ప్రచారం కూడా జిల్లాలో ఉంది. ప్రస్తుతం తిరుపతిలో కలిసిన వెంకటగిరిలో పోటీ చేస్తారా, నెల్లూరులోనే కొనసాగుతారో వేచి చూడాల్సి ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్