January 02 Telugu News Updates : గోవింద నామస్మరణలో మార్మోగుతున్న తిరుమల-andhrapradesh telugu live news updates 01 january 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Andhrapradesh Telugu Live News Updates 01 January 2023

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబైన తిరుమల శ్రీవారి ఆలయం

January 02 Telugu News Updates : గోవింద నామస్మరణలో మార్మోగుతున్న తిరుమల

04:27 PM ISTB.S.Chandra
  • Share on Facebook
04:27 PM IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తలతో కిటకిటలాడుతోంది. తిరుమలతో పాటు యాదాద్రి, సింహాచలం, అన్నవరం వంటి పుణ్య క్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తిరుమలలో అర్థరాత్రి నుంచి శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

Mon, 02 Jan 202302:57 PM IST

బీఆర్ఎస్ లో చేరికలు

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ విస్తరణకు తొలి అడుగులు పడ్డాయి. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిన ఏపీలోని పలువురు నేతలు.. హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాశ్‌, కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడిపాక రమేశ్ నాయుడు, కాపునాడు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు.. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు సహా పలువురు నేతలకి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Mon, 02 Jan 202301:28 PM IST

రేవంత్ ఫైర్

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు నిధులు లేకుండా చేసి గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సర్పంచుల నిధులు, విధులను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటోందని... ఇప్పటి వరకు రూ. 35 వేల కోట్ల గ్రామ సర్పంచుల నిధులను ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ అక్రమంగా వాడేసుకుంటోందని.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు. సర్పంచుల నిధుల సమస్య పరిష్కారం కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం విడుదల చేసిన అనంతరం.. బొల్లారం పీఎస్ వద్ద మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారని.. బిల్లుల కోసం సర్పంచ్‌లు మంత్రులను నిలదీయాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Mon, 02 Jan 202301:17 PM IST

స్వర్ణరథోత్సవం

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వర్ణరథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం కన్నులపండువగా నిర్వహించారు. శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించారు. స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టిటిడి మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సంద‌ర్భంగా గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో తీరుమల వీధులు మార్మోగాయి.

Mon, 02 Jan 202301:03 PM IST

మాటల యుద్ధం

గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై… వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబు ప్రచార యావ వల్లే దుర్ఘటన జరిగిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తుండగా… ఘటన వెనుక కుట్ర దాగి ఉందని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు ప్రచార యావ పరాకాష్టకు చేరిందని.. కందుకూరు, గుంటూరు దుర్ఘటనలు అందుకు నిదర్శనమని.. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని.. సభలకు ఎంత మంది జనం వస్తున్నారు... ఏ రూట్లో వెళుతున్నారు... ఎన్ని వాహనాలు ఉన్నాయన్నది ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య.. సభలో అధికార పార్టీ నేతలు స్లీపర్ సెల్స్ ను పెట్టి అలజడి సృష్టించారేమో అని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, మంత్రుల మాటలు.. ఆ పార్టీ కార్యకర్తల సోషల్ మీడియా హడావుడి చేస్తుంటే .. ఇదంతా ఓ కట్రలా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఘటన వైఎస్సార్సీపీకి తెలిసే జరిగిందని... దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.

Mon, 02 Jan 202310:58 AM IST

సిట్ మెమో కొట్టివేత

ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దాఖలు చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ లను నిందితులుగా పేర్కొంటూ సిట్ గతంలో అవినీతి నిరోధక శాఖ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. సిట్ మెమోను కొట్టివేసింది. దీనిపై హైకోర్టుని ఆశ్రయించింది.. సిట్. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సిట్ అప్పీల్ ను కొట్టివేసింది. అలాగే... ఈ కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లపై సిట్ విచారణపై జనవరి 23 వరకు స్టే పొడిగించింది. బీఎల్ సంతోష్ సహా నలుగురికి సీఆర్పీసీ 41ఏ నోటీసుల జారీపై స్టే విధించింది. గతంలో ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగిసిన నేపథ్యంలో.. స్టే గడువు మళ్లీ పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Mon, 02 Jan 202307:17 AM IST

ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత

 ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీడీపీ, జనసేన నాయకుల ఆందోళనకు దిగారు.  జోగయ్య ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన నేతలు నినాదాలు చేశారు.  ఆస్పత్రి వద్దకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను  ఆస్పత్రిలోకి అనుమతించ లేదు.  ఆస్పత్రిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో  చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.  ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో మాజీ మంత్రి హరిరామజోగయ్యను ఉంచారు.  కాపులకు రిజర్వేషన్ కోరుతూ నేటి నుంచి నిరాహార దీక్షకు జోగయ్య పిలుపునివ్వడంతో  పాలకొల్లులో గత రాత్రి జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. 

Mon, 02 Jan 202307:16 AM IST

గుంటూరు ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం

గుంటూరు ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ఆరోపించారు. అన్ని  అనుమతులతో చేపట్టిన కార్యక్రమానికి సరైన బందోబస్తు ఇవ్వలేదని ఆరోపించారు.  ఎన్‍ఆర్‍ఐ శ్రీనివాస్ సదాశయంతో చేపట్టిన కార్యక్రమంలో ఇలా జరగడం దురదృష్టకరం అన్నారు. గుంటూరులో  జరిగిన ఘటనకు ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  ఏపీలో ప్రజల కోసం ఎన్‍ఆర్‍ఐలు ఎన్నో ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారన్నారు. 

Mon, 02 Jan 202307:04 AM IST

రేవంత్ రెడ్డి అరెస్ట్‌

సర్పంచుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు  ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు  ప్రయత్నించిన రేవంత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హోంమంత్రి నివాసం ముందు కూడా ధర్నాలుచేశామని పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ధర్నాలు, ఆందోళనలు చేయకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని ప్రశ్నించారు.  తన ఇంటికి వచ్చిన కార్పొరేటర్ విజయారెడ్డిని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఎక్కడికైనా వెళ్లేందుకు తనకు హక్కు ఉందని రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

Mon, 02 Jan 202306:40 AM IST

బీఆర్‍ఎస్‍లో చేరే ఏపీ నేతలపై కేఏ పాల్ సెటైర్లు

బీఆర్‍ఎస్‍లో చేరే ఏపీ నేతలపై కేఏ పాల్ సెటైర్లు వేశారు.  డబ్బులకు ఆశపడే తోట చంద్రశేఖర్ బీఆర్‍ఎస్‍లో చేరుతున్నారని విమర‌్శించారు. - ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‍కు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.  విలువలు లేని రాజకీయాలకు తోట తెరతీశారని,  మాజీ మంత్రి రావెల కిషోర్ అవినీతి చక్రవర్తి అని ఆరోపించారు.   నీతి నియమాలు లేనివారే కేసీఆర్ పార్టీలో చేరతారని  కేఏ పాల్ విమర్శించారు. 

Mon, 02 Jan 202306:32 AM IST

కుప్పంలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. జనవరి  4, 5, 6 తేదీల్లో కుప్పంలోని నాలుగు మండలాల్లో  చంద్రబాబు పర్యటించనున్నారు. 

Mon, 02 Jan 202306:31 AM IST

సునీల్ కేసులో నేడు తీర్పు

కాంగ్రెస్ వార్ రూం కేసులో సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.  సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ కనుగోలు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు.. తీర్పును నేటికి వాయిదా వేసింది. దాంతో పాటు పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. సునీల్ కనుగోలు కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులు ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో కాంగ్రెస్ వార్ రూమ్ తో సునీల్ కనుగోలుకు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. 

Mon, 02 Jan 202305:38 AM IST

ఏపీలో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ

ఏపీలో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు.  ఏపీలో నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని,  పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని  సీఎం కేసీఆర్ కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు.  ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అంతే వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని  మంత్రి మల్లారెడ్డి చెప్పారు. 

Mon, 02 Jan 202304:18 AM IST

ప్రముఖుల శ్రీవారి దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తమిళనాడు హైకోర్టు సీజే, మహారాష్ట్ర సీఎం ఏక్‍నాథ్ శిందే ,  డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ఉషశ్రీచరణ్, మేరుగ నాగార్జున, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, గంగుల, శ్రీనివాస్‍గౌడ్, మల్లారెడ్డి తదితరులు దర్శించుకున్నారు. 

Mon, 02 Jan 202304:17 AM IST

గుంటూరు తొక్కిసలాటపై కేసు నమోదు

గుంటూరులో జరిగిన  తొక్కిసలాట ఘటనపై నల్లపాడు పీఎస్‍లో 304, 174 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కార్యక్రమ నిర్వాహకుడు  ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు.  గుంటూరు ఘటనలో గాయపడ్డ 13 మందికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఐసీయూలో రంగాదేవికి చికిత్స అందిస్తుండగా  ఎమర్జెన్సీ వార్డులో రాజేశ్వరి, మస్తాన్, సరోజిని చికిత్స పొందుతున్నారు. 

Mon, 02 Jan 202304:16 AM IST

పింఛన్ కోసం దారుణం

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిన్నపులివర్రులో దారుణం జరిగింది. పింఛన్ డబ్బుల కోసం వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు.  గుడిపల్లి లక్ష్మీవిలాసం వద్ద ఉన్న పింఛన్ డబ్బుల కోసం హత్య చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారని ఆరోపణ రావడంతో  ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని  పోలీసులు విచారిస్తున్నారు. 

Mon, 02 Jan 202304:15 AM IST

కోటంరెడ్డికి సిఎం పిలుపు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ పిలుపు అందింది.  సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్‍ను కలవనున్నారు. జిల్లా బాధ్యుడు బాలినేని శ్రీనివాస్ కూడా హాజరుకావాలని  ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. 

Mon, 02 Jan 202304:18 AM IST

నోట్ల రద్దుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు

నోట్ల రద్దు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై  నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. మొత్తం 58 పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించనుంది.  2016 నవంబర్ 8న రద్దయిన పెద్ద నోట్ల వ్యవహారంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది.