AP TS Weather: ఏపీ వ్యాప్తంగా విస్తరించిన 'రుతుపవనాలు' - తెలంగాణలోనూ వర్షాలు
Weather Updates: ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ ప్రకటించింది.
AP Telangana Weather News: నైరుతి రుతపవనాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. గురువారం నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. గురువారం ఉదయం ఏలూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పల్నాడు జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది.
తెలంగాణలోనూ వర్షాలు…
మరోవైపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గురువారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వచ్చే మూడు రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాబోయే ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఇక శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో, శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యర్మ్రాల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 26వ తేదీ వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 26 నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.