Telugu News  /  Andhra Pradesh  /  Andhrapradesh And Telangana Telugu Live News Updates 15 November 2022

ఏపీ ప్రభుత్వం

November 15 Telugu News Updates : 10 పురపాలికల్లో ప్రత్యేకాధికారుల గడువు పొడిగింపు

  • సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి  విషమించడంతో వెంటిలేటర్‌పై ఉన్న  కృష్ణా మంగళవారం ఉదయం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు.  ఆదివారం రాత్రి 1.15 నిమిషాలకు కృష్ణకు కార్డియాక్‌ అరెస్టు కావడంతో కుటుంబసభ్యులు కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు 20 నిమిషాలపాటు సీపీఆర్‌ చేసినట్లు ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ గురు రెడ్డి తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని ప్రకటించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, క్రిటికల్‌ కేర్‌ యూనిట్లకు చెందిన నిష్ణాతులైన 8 మంది వైద్యనిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తెల్లవారుజామున  పరిస్థితి విషమించడంతో కృష్ణా కన్నుమూశారు.  

Tue, 15 Nov 202217:08 IST

దిల్లీలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రారంభించిన బుగ్గన

పరిశ్రమలు, వాణిజ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -2022లో భాగంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ పెవిలియన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. "వోకల్ ఫర్ లోకల్ - లోకల్ టు గ్లోబల్" నేపథ్యంతో తీర్చిదిద్దిన పెవిలియన్ ను ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన ప్రారంభించారు. ఈనెల 27 వరకు సాగనున్న ఇండియా ఇంటర్‌నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకతను ప్రతిబింబించే భౌగోళిక గుర్తింపు కలిగిన 20 రకాల ఏటికొప్పాక, మ్యాంగో జెల్లి, క్రిస్టల్ సంచులు, లెదర్ ఉత్పత్తులను పెవిలియన్ లో ఉంచారు.

Tue, 15 Nov 202217:07 IST

మూడు రోజుల పాటు కర్నూలులో చంద్రబాబు పర్యటన

కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బుధవారం పత్తికొండలో జరగబోయే బహిరంగసభలో పాల్గొని రాత్రికి ఆదోనిలో బస చేయనున్నారు. గురువారం ఆదోనిలో రోడ్​ షో నిర్వహించనున్నారు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం ఎమ్మిగనూరులో రోడ్ షో, అదే రోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ అనంతరం ఎల్లుండి రాత్రి కర్నూలులో బస చేయనున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Tue, 15 Nov 202217:03 IST

10 పురపాలికల్లో ప్రత్యేకాధికారుల గడువు పొడిగింపు

రాష్ట్రంలోని 10 పురపాలికల్లో ప్రత్యేకాధికారుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం సహా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకాధికారి గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మే 5వ తేదీ లేదా ఎన్నికలు జరిగే వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్ సహా రాజాం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, గుడివాడ, బాపట్ల, గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

Tue, 15 Nov 202211:57 IST

హైదరాబాద్‌కు సీఎం జగన్

సీఎం జగన్‌ బుధవారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గచ్చిబౌలి స్టేడియం చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tue, 15 Nov 202210:55 IST

పరిపాలనపై శ్రద్ధ పెట్టండి

పవన్ కల్యాణ్ ఏది మాట్లాడినా.. ఒకటికి పదిసార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడుతారని జనసేన నేత నాగబాబు అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించి పవన్ తో మాట్లాడారన్నారు. పరిపాలన గాలికి వదిలేసి పవన్ ఏం మాట్లాడరనే దానిపై చర్చలు చేస్తున్నారన్నారు. పరిపాలనపై శ్రద్ధ పెట్టండని నాగబాబు హితవు పలికారు.

Tue, 15 Nov 20229:27 IST

హైకోర్టు నిర్ణయంపై బండి సంజయ్ ఏమన్నారంటే

4గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిప్రాయమని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం ప్రెస్ మీట్ నిర్వహించడంపట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని చెప్పారు.

Tue, 15 Nov 20229:04 IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ దర్యాప్తునకు ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సిట్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని చెప్పింది. సిట్‌ చీఫ్‌ సి.వి.ఆనంద్‌ నేతృత్వంలో దర్యాప్తు జరిగేలా చూడాలని, మీడియా, రాజకీయ నాయకులకు దర్యాప్తు వివరాలు వెల్లడించొద్దని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతి నివేదికను ఈనెల 29న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐతో కేసు విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

Tue, 15 Nov 20229:01 IST

మంచి మిత్రుడిని కోల్పోయానన్న సిఎం కేసీఆర్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు కృష్ణను కోల్పోవడం తనకు తీరని లోటని సిఎం కేసీఆర్‌ చెప్పారు. గతంలో తాను చాలా సార్లు  కృష్ణ ఆతిథ్యం స్వీకరించానని చెప్పారు. అల్లూరి సీతారామరాజు చాలాసార్లు చూశానని చెబితే సంతోషించారన్నారు. తెలంగాణ పభుత్వం ఆయన సేవల్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కేసీఆర్  చెప్పారు. కుటుంబ సభ‌్యులకు దు‌:ఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నారు. 

Tue, 15 Nov 20228:54 IST

కృష్ణకు కేసీఆర్‌ నివాళులు

సినీ నటుడు కృష్ణకు తెలంగాణ సిఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌ రావు, పువ్వాడ అజయ్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌ , పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ మహేష్‌ను హత్తుకుని ఓదార్చారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావును కేసీఆర్ పరామర్శించారు. 

Tue, 15 Nov 20228:02 IST

చంద్రబాబు నివాళులు

సినీ నటుడు కృష్ణ పార్థివదేహానికి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.  నటుడు మహేష్ బాబు, నమ్రతలను చంద్రబాబు ఓదార్చారు. అంతకు ముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహేష్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

Tue, 15 Nov 20227:30 IST

అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

దివంగత సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

Tue, 15 Nov 20227:29 IST

నానక్ రాంగూడ నివాసానికి తరలింపు

కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‍రామ్‍గూడలోని నివాసానికి కృష్ణ పార్థివదేహం తరలించారు.  సాయంత్రం 5 గంటల వరకు నివాసం వద్దే పార్థివదేహాన్ని ఉంచనున్నారు.  సాయంత్రం 5 తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్థివదేహం తరలిస్తారు.  అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ పార్థివదేహం ఉంచుతారు.

Tue, 15 Nov 20228:37 IST

కృష్ణ మృతికి ప్రధాని నివాళులు

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.  అనేక రకాల పాత్రలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.  కృష్ణా మరణం సినీ రంగానికి తీరని లోటన్నారు.  మహేశ్‍బాబు సహా కుటుంబ సభ్యులందరికీ  ప్రగాఢ సానుభూతిని  ప్రధాని మోదీ ప్రకటించారు. 

Tue, 15 Nov 20226:23 IST

 తమిళనాడు సిఎం స్టాలిన్ సంతాపం….

నటుడు  కృష్ణ మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం తెలిపారు.  తెలుగు సినీరంగంలో ప్రయోగాత్మక, విలక్షణ పాత్రలు చేశారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.  కృష్ణ మరణం సినీరంగానికి తీరని లోటు అని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

Tue, 15 Nov 20226:06 IST

కాసేపట్లో కృష్ణ నివాసానికి కేసీఆర్‌

గుండెపోటుతో మరణించిన నటుడు కృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించనున్నారు. నానక్‌ రాం గూడలోని కృష్ణ నివాసంలో  కృష్ణ కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి నివాళులు అర్పిస్తారు. ముఖ్యమంత్రి నివాళులు అర్పించే సమయంలో కృష్ణకుటుంబ సభ్యులతో, సన్నిహితులను మాత్రమే ఇంట్లోకి  అనుమతించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు సిఎం నివాళులు అర్పించిన తర్వాత కృష్ణ పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలించనున్నారు. 

Tue, 15 Nov 20225:32 IST

ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన సంతాపం

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణగారి మృతి పట్ల  బిసీ సంక్షేమశాఖ, సమాచార మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంతాపం తెలిపారు.  తన ప్రతిభతో సినీ రంగంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులు హృదయాల్లో ఓ కౌబాయ్ స్థానంతో పాటు చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. 

Tue, 15 Nov 20225:30 IST

ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం….

ప్రముఖ చలనచిత్ర నటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర​ సంతాపం ప్రకటించారు. కృష్ణ మృతి వార్త బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ ​స్టార్ కుటుంబసభ్యులకుప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్ బాబు, నరేష్ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్ ఆని, సంచలన సినిమాలు చేయాలన్నా.. సాహస సినిమాలు తీయాలన్నా.. సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా అని కొనియాడారు.

Tue, 15 Nov 20225:29 IST

ఘట్టమనేని కృష్ణ మృతిపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సంతాపం

తెలుగు వెండితెర ‘కౌబాయ్’, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ పరమపదించారని తెలిసి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదున్నర దశాబ్దాలపాటు టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.  తెలుగు సినిమాతెరపై ‘జేమ్స్ బాండ్’ జోనర్ ను పరిచయంచేసి, తెలుగు సినీ చరిత్రలో సాంకేతికకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేసి, తెలుగు చిత్రపరిశ్రమ ‘సింహాసనం’ను అధిష్టించారన్నారు. కృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపారు.

Tue, 15 Nov 20225:28 IST

కృష్ణ  మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు….

సూపర్ స్టార్  కృష్ణ మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటన్నారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. చిత్ర రంగంలోకి సుడిగాలిలా ప్రవేశించి ఒక ప్రత్యేకతను సృష్టించిన  కృష్ణరి రాజకీయ రంగ ప్రవేశం కూడా అలానే జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ  మీద, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు.   వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా అత్యంత ఆప్తులని చెప్పారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి వీరు కడపలో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యర్థులు రాళ్ల వర్షం కురిపించిన లెక్క చేయలేదని గుర్తు చేసుకున్నారు. 

Tue, 15 Nov 20225:25 IST

మంచి మనిషి కృష్ణ…

తెలుగు సినీ రంగ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూయడం బాధాకరమని జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కృష్ణ  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.  తెనాలి మండలం బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్ళి సినీ స్టార్ గా ఎదిగిన మంచి మనిషి అని పేర్కొన్నారు.  తన స్వగ్రామంపై ఎంతో ప్రేమాభిమానాలు చూపేవారని,  బుర్రిపాలెంలో అభివృద్ది కార్యక్రమాలకు కృష్ణ అండగా నిలిచారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలు, ప్రజా జీవితంలో కొద్ది కాలమే ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా తన ముద్రను వేశారని చెప్పారు. 

Tue, 15 Nov 20223:26 IST

కొప్పుల ఈశ్వర్  సంతాపం

పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎం.పీ కృష్ణ మృతి పట్ల రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్నారు. తెలుగు సినిమా రంగంలో తీసుకు వచ్చిన మార్పులు మరువలేనివన్నారు. కృష్ణ ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు... ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు.

Tue, 15 Nov 20223:25 IST

తలసాని నివాళులు

సినీ హీరో కృష్ణ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నటుడిగా, నిర్మాతగా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tue, 15 Nov 20223:24 IST

మంత్రి శ్రీనివాసగౌడ్ సంతాపం

ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మాలయా స్టూడియో అధినేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి - 79) మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  నివాస్ గౌడ్ సంతాపం ప్రకటించారు.

Tue, 15 Nov 20223:23 IST

హరీష్‌ రావు సంతాపం….

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు.  350కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల హృదయాల్లో సూపర్ స్టార్ గా నిలిచారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధితనేతగా ఆయన చలన చిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.  పౌరాణిక, కుటుంబ, సాంఘీక చిత్రాల్లోను, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక పాత్రలను, కౌబాయ్, జెమ్స్ బాండ్ తరహా విభిన్న పాత్రలు పోషించి సినీ ప్రియులను కృష్ణ రంజింపజేశారని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఘట్టమనేని శివరామ కృష్ణ మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tue, 15 Nov 20223:22 IST

ఘట్టమనేని కృష్ణ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారన్నారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన అని ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 

Tue, 15 Nov 20222:50 IST

సోము వీర్రాజు సంతాపం

చలనచిత్ర నటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు అని, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలు తెరకెక్కించిన మహానటుడు కృష్ణ అని సోము వీర్రాజు గుర్తు చేశారు.

Tue, 15 Nov 20222:31 IST

పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ సంతాపం

ప్రముఖ చలన చిత్ర నటుడు, సినీ హీరో సూపర్ స్టార్ క్రిష్ణ మరణం పట్ల ఎపిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాధ్ సంతాపం తెలిపారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్ధాల పాటు క్రిష్ణ అందించిన సేవలు మరువరానివన్నారు.  350 కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హ్రుదయాల్లో చెరగని ముద్ర వేసిన క్రిష్ణ మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటని చెప్పారు విభిన్న కుటుంబ కధా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడుగా  జనాదరణ పొందారన్నారు.  1989 లో ఏలూరు నుండి కాంగ్రెస్ ఎంపి గా పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలందించారని గుర్తు చేశారు. 

Tue, 15 Nov 20222:10 IST

సిఎం జగన్మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి

నటుడు కృష్ణా మృతి పట్ల ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పనిచేసిన కృష్ణ చెరగని ముద్ర వేశారన్నారు. కృష్ణా కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియ చేశారు. 

Tue, 15 Nov 20222:08 IST

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన మద్యం అమ్మకాలు…

ఆంధ్రప్రదేశ్‌లో గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని సిఎం జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేయడం వంటి వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల ఏపీలో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. మద్య అక్రమ రవాణాను నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే... అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. 

Tue, 15 Nov 20221:34 IST

కృష్ణ మరణం పట్ల గవర్నర్ సంతాపం

 ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) 79 మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు, సామాజిక స్పృహ కల్పించే పలు చిత్రాలతో కృష్ణ జనాదరణ పొందారన్నారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tue, 15 Nov 20221:32 IST

తేనె మనసులతో సినిమాల్లోకి ఎంట్రీ.....

1964లో తేనె మనసులు సినిమాతో కృష్ణా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన తేనె మనసులుతో కృష్ణ సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, కృష్ణను తొలగించాలని పలువురు సూచించినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

Tue, 15 Nov 20221:29 IST

ఇంజినీరింగ్ సీటు రాకపోవడంతో.....

తెనాలికి చెందిన కృష్ణా తండ్రి కలప వ్యాపారాన్ని నిర్వహించేవారు. కృష్ణాను ఇంజనీరింగ్ చదివించాలని ఆయన తండ్రి భావించారు. అందులో సీటు రాకపోవడంతో ఏలూరు సిఆర్‌ రెడ్డి కాలేజీలో డిగ్రీలో చేరారు. డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్‌లో చేరేందుకు ప్రయత్నించారు. నటులు జగ్గయ్య, గుమ్మడి,నిర్మాత చక్రపాణి తెనాలికి చెందిన వారు కావడంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. వయసు తక్కువగా ఉండటంతో కొన్నాళ్ల తర్వాత ప్రయత్నించాలని సూచించడంతో ప్రజా నాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు.

Tue, 15 Nov 20221:26 IST

కృష్ణాకు ఐదుగురు సంతానం....

నటుడు కృష్ణా 1965లో ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్‌బాబు, మహేష్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల..కృష్ణా పెద్ద కుమారుడు రమేష్‌ బాబు ఇటీవల కొద్ది నెలల క్రితం కన్నుమూశారు. సినిమాల్లో పనిచేస్తుండగా నటి,దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

Tue, 15 Nov 20221:22 IST

అక్కినేని ప్రేరణతో సినిమాల్లోకి ఎంట్రీ

 

అక్కినేని నాగేశ్వరరావు ప్రేరణతో కృష్ణా సినీరంగంలో ప్రవేశించారు. ఏలూరు సిఆర్‌రెడ్డి కాలేజీలో చదువుకునే సమయంలో అక్కడకు వచ్చిన నటుడు నాగేశ్వరరావుకు లభించిన ఆదరణ చూసి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం చూసి సినీపరిశ్రమ వైపు కృష్ణా అడుగులు వేశారు. తొలినాళ్లలో అనుభవం లేకపోవడంతో నాటక రంగంలో పనిచేయాల్సిందిగా దర్శకులు సూచించారు. తర్వాత చిత్ర సీమలో అడుగుపెట్టి సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగారు.

Tue, 15 Nov 20221:32 IST

మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్‌తోనే కృష్ణా కన్నుమూత

కార్డియాక్‌ అరెస్టు కారణంగా నటుడు కృష్ణా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయంపై తీవ్ర ప్రభావం పడిందని, డయాలసిస్‌ చేస్తున్నామని వైద్యులు ప్రకటించారు. ఆదివారం అర్థరాత్రి శ్వాసకోశ సమస్యకు గురైన కృష్ణాను హుటాహుటిన ఆస్పత్రికి  తరలించారు. 

ఆర్టికల్ షేర్ చేయండి