September 23 Telugu News Updates : రెండో టీ20లో ఆసీస్ పై భారత్ విక్టరీ-andhrapradesh and telangana live news updates september 23092022
Telugu News  /  Andhra Pradesh  /  Andhrapradesh And Telangana Live News Updates September 23092022

భారత్ విజయం(twitter)

September 23 Telugu News Updates : రెండో టీ20లో ఆసీస్ పై భారత్ విక్టరీ

Today Telugu News Updates: సెప్టెంబర్ 23 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

Fri, 23 Sep 202217:47 IST

భారత్ విక్టరీ..

రెండో టీ20 మ్యాచ్ లో ఆసీస్ పై భారత్ విక్టరీ కొట్టింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 8 ఓవర్లలో ఆసీస్ 90 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్... దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్ష్యాన్ని చేధించింది. నాలుగు బంతులు మిగిలి ఉండగానే... 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుంది.

Fri, 23 Sep 202216:20 IST

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్‌ 23, 24 తేదీల్లో ఈ మహాసభలు విజయవాడలో నిర్వహించనున్నారు.

Fri, 23 Sep 202215:56 IST

ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర

 బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్  అక్టోబర్‌ 15 నుంచి  ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర  చేపట్టబోతున్నారు. బాసర  సరస్వతి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఖానాపూర్ దగ్గర పాదయాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. 200 కి.మీటర్ల దూరం 20 రోజుల పాటు బండి సంజయ్‌ పాదయాత్ర సాగనుంది.

Fri, 23 Sep 202215:54 IST

ఉద్యోగాలు…

APSGWD Technical Assistant Recruitment 2022: ఏపీ ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం, జల గణన శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా.. 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

Fri, 23 Sep 202215:17 IST

విస్తృత ఏర్పాట్లు….

tirumala brahmotsavam 2022 dates: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణంకు ఊప‌యోగించే దర్భ చాప, తాడును వ‌రా‌హ‌స్వామి అథితి గృహా‌ల వ‌ద్ద ఉన్న టిటిడి అట‌వీ విభాగం కార్యాల‌యం ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు.

Fri, 23 Sep 202213:30 IST

అంకబాబుకు బెయిల్‌

సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్‌ చేశారని ఆరోపిస్తూ సీఐడీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసిన జర్నలిస్టు కొల్లు అంకబాబుకు బెయిల్‌ మంజూరైంది. ఈరోజు ఆయన్ను అంకబాబును రిమాండ్‌కు తరలించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, సీఐడీ రిమాండ్‌ నివేదికను కొట్టివేసిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

Fri, 23 Sep 202213:10 IST

షర్మిల రియాక్షన్….

ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పుపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానపరినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇవాళ పేరు మార్చి ఆ కోట్లాది మంది ఆరాధించే పెద్ద మనిషిని అవమానిస్తే ..రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని అవమానించినట్లే అవుతుందన్నారు. పాదయాత్రలో భాగంగానే షర్మిల ఇదే అంశంపై ఇంకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతున్నాయి.

Fri, 23 Sep 202212:33 IST

కాగ్ నివేదికపై బుగ్గన కామెంట్స్…

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ పూసగుచ్చినట్లు వివరించారని అన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గత టీడీపీ పాలనలో జరిగిందేమిటో....గత మూడున్నర ఏళ్ల కాలంలో తన పరిపాలనలో ఆర్థిక నిర్వహణ ఎలా జరిగిందో... జరుగుతున్నదో చక్కగా చెప్పారని తెలిపారు. తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికపై స్పందిస్తూ.... తన నివేదికలో పొందు పర్చిన అంశాల్లో తొలి నాలుగేళ్ల టీడీపీ పరిపాలనలోని ఆర్థిక వ్యవహారాలపైనే అనే విషయం గ్రహించాలని కోరారు. ఈ నివేదికలో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగ్‌ నివేదికలో పొందు పర్చిన ప్రత్యేక బిల్లుల అంశం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదే అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ ప్రభావం ఎంతగా ఉండిందో ప్రజలకు బాగా తెలుసన్న బుగ్గన్న. ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశం లావాదేవీల సర్దుబాట్లకు సంబంధించిన అంశమే అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక బిల్లులపై ఆర్థిక మంత్రి హోదాలో తాను గతంలోనే సవివరమైన సమాధానం చెప్పానని వెల్లడించారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించ లేదని చెప్పారు. కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే వారు అభ్యంతరం లేవ నెత్తారని అన్నారు. ఈ సమస్యలన్నీ కూడా సీఎఫ్‌ఎంస్‌ వ్యవస్థను పటిష్టంగా రూపొందించక పోవడం వల్లనే తలెత్తాయని పేర్కొన్నారు.

Fri, 23 Sep 202211:17 IST

అజహరుద్దీన్‌ కామెంట్స్…

  ఆసీస్‌ భారత్ మ్యాచ్‌ టికెట్ల అమ్మకానికి, హెచ్‌సీఏకు సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ అన్నారు. టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించినట్టు తెలిపారు. బ్లాక్ లో టికెట్లు అమ్మలేదని స్పష్టం చేశారు.

Fri, 23 Sep 202210:33 IST

పింఛన్ల పెంపు…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. జనవరి నుంచి పింఛను పెంచుతున్నట్లు సీఎం జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రారంభోత్సవంలో ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే జనవరి నుంచి పింఛను రూ. 2,750కు పెంచుతున్నట్లు వెల్లడించారు.

Fri, 23 Sep 202210:29 IST

మరో నోటిఫికేషన్….!

Telangana Jobs 2022: తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా... మరికొన్నింటిని ఇచ్చేందుకు కూడా కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే మిగతా శాఖలు కూడా అదే పనిలో పడ్డాయి. ఇర మరో రెండు మూడు రోజుల్లో కీలక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావ్ ప్రకటన చేశారు. ఈ రెండు మూడురోజుల్లోనే 1140 అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. శుక్రవారం నిమ్స్‌ హాస్పటల్ లో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన...ఈ నోటిఫికేషన్ పై ప్రకటన చేశారు. పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి రాబోయే పది రోజుల్లో ఆదేశాలు వస్తాయని..., మరో 140 మంది మిడ్‌ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు.

Fri, 23 Sep 20229:54 IST

మెట్రో వార్నింగ్….

మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికించటాన్ని సీరియస్ గా తీసుకుంది మెట్రో సంస్థ. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రకటనకర్తలు మెట్రో పిల్లర్లు, రైల్వే స్టేషన్లను ప్రకటనల కేంద్రంగా మార్చుకోవటం సరికాదని... ఇలా అనుమతుల్లేకుండా పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

Fri, 23 Sep 20229:15 IST

మున్నార్ టూర్ ప్యాకేజీ

irctc tourism announced munnatr tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.ఈ నెల అక్టోబర్ 11వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Fri, 23 Sep 20228:57 IST

కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు…!

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో​ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.  ఇందులో షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆయా నేతలు స్పందిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Fri, 23 Sep 20228:22 IST

జనవరి నుంచి పెన్షన్ల పెంపు

ఏపీలో జనవరి నెల నుంచి రూ.2500లు ఉన్న పెన్షన్ ను రూ.2750లకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.కుప్పం నియోజకవర్గంలో రూ.11కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆఫీసుల కాంప్లెక్స్ ను ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ. రాష్ట్రంలో జనవరి నెల నుంచి పెన్షన్ రూ.2750లకు పెరుగుతుందన్నారు.

Fri, 23 Sep 20228:05 IST

బీసీల స్థానంలో చంద్రబాబు పోటీ

బీసీలకు దక్కాల్సిన కుప్పం నియోజక వర్గాన్ని చంద్రబాబు కబ్జా చేశారని సిఎం జగన్ ఆరోపించారు. 1983 నుంచి 2019వరకు ఒక్కసారి కూడా బీసీలకు కేటాయించలేదని,  బాబు మార్కు సామాజిక  న్యాయం అదేనని విమర్శించారు. కుప్పంలో  అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలకు చెందాల్సిన స్థానాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. 

Fri, 23 Sep 20228:00 IST

చంద్రబాబు నాన్ లోకల్

కుప్పంకు చంద్రబాబు నాన్‌ లోకల్ అని, ఆయన హైదరాద్‌లో మాత్రమే లోకల్ అని జగన్ ఎద్దేవా చేశారు. 32ఏళ్లుగా కుప్పం ప్రజలు గెలిపిస్తున్నా నియోజక వర్గానికి ఆయన చేసిందేమి జగన్ ఆరోపించారు. 

Fri, 23 Sep 20227:24 IST

భరత్‌ను గెలిపిస్తే  మంత్రిని చేస్తారు

 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీలేదని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.  వైఎస్ జగన్ సీఎం అయ్యాక కుప్పం రూపురేఖలు మారాయని,  మూడేళ్లలో మహిళలకు రూ.2.39 లక్షల కోట్ల సాయం అందించామని చెప్పారు.  నాడు-నేడుతో స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని చెప్పారు. - గ్రామ, వార్డు సచివాలయాలతో పాలన ప్రజలకు చేరువైందని,  కులమతాలు, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతామని, కుప్పం అభివృద్ధిని వైఎస్ జగన్ చేతల్లో చూపిస్తున్నారని,  భరత్‍ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Fri, 23 Sep 20227:02 IST

చంద్రబాబుతో ఇల్లు కట్టిస్తున్నాం….

32ఏళ్లుగా కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు, స్థానికంగా ఇల్లు కట్టుకునేలా చేయడమే జగన్ సాధించిన విజయమని చెప్పారు ఎమ్మెల్సీ భరత్. చేయూత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నియోజక వర్గానికి అవసరమైన పాలార్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  కుప్పంను పులివెందుల మాదిరి మారుస్తానని చెప్పినట్లే సిఎం జగన్‌ పనులు  చేస్తున్నారని చెప్పారు. 

Fri, 23 Sep 20226:46 IST

ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయం లో ఘన స్వాగతం

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  చిత్తూరు జిల్లా కుప్పంలో   పర్యటిస్తున్నారు. చేయూత కార్యక్రమంలో పాల్గొనటానికి విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట  చేరుకున్నారు. విమానాశ్రయంలో  ఘన స్వాగతం లభించింది.

Fri, 23 Sep 20226:01 IST

జర్నలిస్టుపై కుట్ర కేసు

వాట్సాప్‌ సందేశాలు ఫార్వార్డ్‌ చేశారనే అభియోగాలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న వెటరన్ జర్నలిస్టుపై సిఐడి పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు.  అంకబాబుపై 120బి, 153, 550 ఐపీసీ సెక్షన్ల కింద కేసు  నమోదు చేశారు. ఆయన్ని వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‍కు తరలించారు. - కాసేపట్లో అంకబాబును కోర్టులో హాజరుపర్చనున్నారు. 

Fri, 23 Sep 20225:25 IST

విజయవాడలో ఘోర ప్రమాదం

విజయవాడ రామవరప్పాడు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.  రామవరప్పాడు వద్ద  ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కూలీ పనుల కోసం విజయవాడ వచ్చిన వారిగా గుర్తించారు. ఒడిశా నుంచి  వచ్చిన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Fri, 23 Sep 20224:07 IST

వైసీపీ నాయకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుముళ్ళలో దారుణహత్య జరిగింది.  వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజను లారీతో తొక్కించి హత్య చేశారు.  వైసీపీలోని మరో వర్గమే హత్య చేయించిందని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Fri, 23 Sep 20224:07 IST

జర్నలిస్ట్‌ అంకబాబు అరెస్ట్‌పై ఉత్కంఠ

 జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ పై  ఉత్కంఠ కొనసాగుతోంది. తన భర్తను సమాచారం ఇవ్వకుండా సీఐడీ అదుపులోకి తీసుకున్నారని  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అంకబాబు సతీమణి విజయ. ఏపీ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీలకు విజయ లేఖ  రాశారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‍లో  విజయ ఫిర్యాదు చేశారు. మరోవైపు  గుంటూరు సీఐడీ ఆఫీస్‍లో అంకబాబును టీడీపీ నేతలు వెలగపూడి గోపాలకృష్ణ, దేవినేని ఉమ, న్యాయవాదులు కలుసుకున్నారు. 

Fri, 23 Sep 20224:07 IST

పన్నెండో రోజు రాజధాని రైతుల మహా పాదయాత్ర

అమరావతి రైతుల పాదయాత్ర 12వ రోజు కొనసాగుతోంది. పె డన, గుడివాడ నియోజకవర్గాల్లో రైతుల పాదయాత్ర సాగుతోంది.  మచిలీపట్నం నియోజకవర్గం హుస్సేన్ పాలెం నుంచి పాదయాత్ర  మొదలై పెడన, నడుపూరులో కొనసాగనున్నది.  రెడ్డిపాలెం వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. రెడ్డిపాలెం నుంచి వడ్లమన్నాడు వరకు పాదయాత్ర  కొనసాగనుంది. భోజన విరామం తర్వాత వేమవరం మీదుగా కవుతవరం వరకు యాత్ర  సాగుతుంది.   నేడు దాదాపు 15 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర సాగనుంది. 

Fri, 23 Sep 20224:07 IST

వైఎస్సార్సీపీలో ఐదేళ్లకోసారి ఎన్నికలు

వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ జూలైలో జరిగిన ప్లీనరీలో చేసిన తీర్మానం ఆమోదం పొందలేదని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని సీఎం జగన్ తిరస్కరించారన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని తమను కోరిందని తెలిపారు. వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉండాలని జూలైలో జరిగిన ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమేనన్న ఆయన.. కార్యకర్తల కోరిక మేరకు తీర్మానం చేసినట్టు వివరించారు. అయితే, ఆ పదవిని వైఎస్ జగన్ తిరస్కరించినందున తీర్మానం అమల్లోకి రాలేదన్నారు.

ఆర్టికల్ షేర్ చేయండి