కర్ణాటక కుంకీ ఏనుగులకు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్ సహా అనేక రాష్ట్రాలకు కర్ణాటక కుంకీ ఏనుగులను పంపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఏనుగులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఏడాది నుండి జరిగిన చర్చల తర్వాత ఇప్పుడు ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌కు మే 21న 6 కుంకీ ఏనుగులను పంపించనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివవ్ తో ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై చర్చించారు. వీరి చర్చల ఫలితంగా ఆరు ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 8 కుంకీ ఏనుగులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో ఆరు ఏనుగులు మాత్రమే ఇచ్చేందుకు కర్ణాటక అటవీ శాఖ అంగీకరించింది.
దుబరే (కొడగు శిబిరం) నుంచి మాస్తి, దేవ, రంజన్, సక్రెబైల్ (షిమోగా క్యాంపు) నుంచి కరుణా, కృష్ణ, అభిమన్యు కుంకీ ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించింది. కర్ణాటక దసరా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవం కోసం వినియోగించే ఏ కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వడంలేదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
కర్ణాటక అటవీ, పర్యావరణ మంత్రి ఈశ్వర బి ఖండ్రే ఈ విషయంపై ప్రకటన జారీ చేశారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత, సంబంధాలు పెంచుకోవడంతో పాటు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రజల రక్షణలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
గత ఆగస్టులో బెంగళూరులో జరిగిన ఏనుగులు-మానవ సంఘర్షణ అంతర్జాతీయ సదస్సులో కర్ణాటక- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కేరళ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఏనుగులు ఆయా రాష్ట్రాలకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గత ఏడాది ఆగస్టు 8న పవన్ కల్యాణ్ బెంగళూరులో పర్యటించారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల బెడదను తగ్గించడానికి కుంకీ ఏనుగులను అందించాలని, అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 27న కర్ణాటక బృందం ఏపీలోని విజయవాడలో పర్యటించి ఒప్పందం చేసుకున్నారు. మే 21న ఆరు కుంకీ ఏనుగులను అందించాలని నిర్ణయించుకున్నారు.
సంబంధిత కథనం