APL : ఐపీఎల్ తరహాలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. జులై 6 నుంచే స్టార్ట్
ఏపీలో జూలై 6న ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ తరహాలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తెరమీదికి వచ్చింది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ మెగా క్రికెట్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు తలపడతాయి. ఫ్రాంచైజీల కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బిడ్డింగ్స్ ను ఇదివరకే ఆహ్వానించింది. మొత్తం 27 ఎంట్రీలు రాగా.. ఇందులో తొమ్మిదింటిని షార్ట్ లిస్ట్ చేసింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. చివరికు ఆరు ప్రాంచైజీలను ఎంపిక చేశారు.
రాయలసీమ కింగ్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ పేర్లతో ప్రాంఛైజీలు ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ లో మొత్తం 20 మంది ప్లేయర్లు ఉంటారు. ఒక్కో ఫ్రాంచైజీలో హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ ఫిజియోతో పాటు మరో నలుగురు సపోర్టింగ్ స్టాఫ్ సైతం ఉన్నారు. ఈ ఆరు ఫ్రాంఛైజీలను వేరు వేరు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఏర్పాటు చేశారు. మ్యాచ్ లు అన్నీ విశాఖపట్నం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలోనే షెడ్యూల్ చేశారు. జులై 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు తొలి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జులై 17వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లక్ష్యమని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సీఈవో ఎం వెంకట శివారెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఏపీఎల్ టీ20 టోర్నీ-2022 ఫ్రాంచైజీల లోగోలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ పోటీలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. తొలిసారిగా జరిగిన APL టోర్నమెంట్‌పై ఎలాంటి అవినీతికి పాల్పడకుండా లేదా విమర్శలు రాకుండా ఉండేందుకు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాశామని చెప్పాడు. జులై 6 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఆరు జట్లు తలపడనున్నాయని.. మహిళా ఏపీఎల్‌ను కూడా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీఏ కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో నిర్వహిస్తున్న ఇతర ప్రీమియర్ లీగ్‌ల నుంచి ఇన్‌పుట్‌లు తీసుకుని తొలి ఎడిషన్ ఏపీఎల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్‌కు బీసీసీఐ ఆమోదం ఉందని, మార్గదర్శకాల ప్రకారం టోర్నమెంట్ నిర్వహిస్తామని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వై సత్య ప్రసాద్ అన్నారు. శ్రీరామ్ గ్రూప్ APL టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుందని, దానిని శ్రీరామ్ APL అని పిలుస్తామని ACA ప్రతినిధులు ప్రకటించారు. మ్యాచ్‌లు YSR ACA VDCA స్టేడియంలో జరుగుతాయన్నారు. డే అండ్ నైట్ మ్యాచ్‌లు కూడా ఆడతారని తెలిపారు.
టాపిక్