September 10 Telugu News Updates : విజయవాడలో భారీ వర్షం-andhra pradesh telugu live news updates september 10092022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Telugu Live News Updates September 10092022

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

September 10 Telugu News Updates : విజయవాడలో భారీ వర్షం

04:52 PM ISTB.S.Chandra
  • Share on Facebook
04:52 PM IST

  • September 10 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..

Sat, 10 Sep 202204:52 PM IST

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Cancellation of 34 MMTS Train Services: పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 11వ తేదీన అంటే ఆదివారం రోజున 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది.

Sat, 10 Sep 202204:46 PM IST

2వేల మైలురాయి

వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్‌ వద్ద పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్‌ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు.

Sat, 10 Sep 202202:57 PM IST

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర…

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ 12వ తేదీ నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్నారు. మొత్తం 11 రోజుల పాటు.. 110కి.మీ. మేర పాదయాత్ర సాగుతుంది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. పెద్దఅంబర్‌పేట్‌లో 22వ తేదీన ముగింపు సభ నిర్వహించనున్నారు.

Sat, 10 Sep 202201:37 PM IST

హస్తం పార్టీ యాక్షన్ ప్లాన్

మునుగోడు అభ్యర్థి విషయంలో అందరినీ సంప్రందించాకే నిర్ణయం తీసుకున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం గాంధీభవన్ లో ముఖ్య నేతల సమావేశం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల అంశమే ప్రధాన అజెండగా జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని మండలాలకు పలువురు నేతలను ఇంఛార్జులుగా నియమించారు.

మునుగోడు - భట్టి విక్రమార్క

నాంపల్లి - దామోదర రాజనర్సింహ

చౌటుప్పల్ రూరల్ - ఉత్తమ్ కుమార్

మర్రిగూడ - శ్రీధర్ బాబు

చండూరు - షబ్బీర్ ఆలీ

గట్టుప్పల్ - వీ హనుమంతరావు

నారాయణపూర్ - రేవంత్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ - గీతారెడ్డి

Sat, 10 Sep 202212:37 PM IST

భారీ వర్షం

విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ జామ్ కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

Sat, 10 Sep 202211:39 AM IST

27 న తిరుమలకు సీఎం జగన్

శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడారు.

Sat, 10 Sep 202210:30 AM IST

మెట్రో రికార్డు…

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం మెట్రో రైళ్ల సమయం పొడిగించడంతో రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించారు.

Sat, 10 Sep 202209:06 AM IST

మరో 3 రోజులు వర్షాలుు..

IMD Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Sat, 10 Sep 202207:05 AM IST

రాహుల్ పాదయాత్ర

తమిళనాడులోని  కన్యాకుమారి నుంచి  రాహుల్ గాంధీ చేపట్టిన  పాదయాత్ర  కొనసాగుతోంది.  కన్యాకుమారి జిల్లా మార్తాండం లోని నేసమని క్రిస్టియన్ మెమోరియల్ కాలేజ్ వద్ద రాహుల్ బస చేశారు.  సాయంత్రం 4 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ 12 కిలోమీటర్ల మేర సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర  రాత్రికి కేరళలోకి ప్రవేశించనుంది. త్రివేండ్రం దగ్గర్లోని చెరువర కోణం నుంచి కేరళలోకి ప్రవేశించనున్నారు. కేరళలో19 రోజులు  పాటు  457 కిలోమీటర్లు మేర  రాహుల్ పాదయాత్ర సాగనుంది.

Sat, 10 Sep 202206:29 AM IST

మంత్రుల వీడియో విడుదల

ఆంధ్రప్రదేశ్‌  మంత్రుల విజ్ఞాన ప్రదర్శన పేరిట  వీడియోను నారా లోకేశ్ విడుదల చేశారు.  జగన్ ఇచ్చిన హామీలన్నీ ఒట్టిదేనంటున్న మంత్రులంటూ వీడియో విడుదల చేశారు.  అమర్నాథ్, బొత్స, వనిత, అంబటి ప్రసంగాలతో వీడియో విడుదల రూపొందించారు. 

Sat, 10 Sep 202206:13 AM IST

ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్‍ల బదిలీ అయ్యారు.  స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా గిరిజా శంకర్‌ను నియమించారు.   పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీగా కమిషనర్‍గా అరుణ్‍కుమార్‌కు, - జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‍కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

Sat, 10 Sep 202206:12 AM IST

హైదరాబాద్‌కు కుమారస్వామి

రేపు హైదరాబాద్‌కు జేడీఎస్‌  కుమారస్వామి రానున్నారు.  భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటుపై కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు.  త్వరలో దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. 

Sat, 10 Sep 202206:11 AM IST

పార్టీలో కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపణ

డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.  పార్టీలో ఓ వ్యక్తి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటానని చెప్పారు.  పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోవాలన్నారు. 

Sat, 10 Sep 202204:59 AM IST

చెరువుకు గండి

మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎల్.ఎన్.పురంలో బవిరిపూడి చెరువుకు గండి పడింది. చెరువుకు  గండి పడటంతో  పొలాల్లోకి చెరువు నీరు ప్రవహిస్తోంది.  దీంతో  రైతుల అవస్థలు పడుతున్నారు.  గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు,  గండిని పూడ్చేందుకు ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు. 

Sat, 10 Sep 202204:57 AM IST

పోలీస్‌ స్టేషన్‌లో పేలుడు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పోలీస్‌ స్టేషన్‌లో బాణాసంచా పేలుడు సంభవించింది.  సీజ్ చేసిన దీపావళి బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయి.   భారీ పేలుడు శబ్ధాలకు భయంతో  జనం  పరుగులు పెట్టారు. పేలుడులో  ప్రాణనష్టం తప్పినా, పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది.

Sat, 10 Sep 202204:29 AM IST

బియ్యం ఎగుమతులపై నిషేధం

నూకలబియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.  బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని విధించింది.  పారాబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై మాత్రం నిషేధం, ఎక్సైజ్‌ సుంకాలు వర్తించవని పేర్కొంది. ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సాగు కోటి నుంచి కోటీ 20 లక్షల టన్నుల వరకు తగ్గుతుందని అంచనా వేసిన నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే మీడియాకు తెలిపారు. తాజా ఆదేశాలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు.

Sat, 10 Sep 202204:29 AM IST

చంద్రబాబు పిఏపై దాడి

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ డ్రైవర్‌ నాగరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగరాజును కుప్పం పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీపు రం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నాగరాజు ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Sat, 10 Sep 202204:29 AM IST

నిండకుండలా సోమశిల ప్రాజెక్టు

సోమశిల జలాశయానికి  వరద ప్రవాహం కొనసాగుతోంది.   ఎగువన వర్షాలకు సోమశిలకు44,493 క్యూసెక్కుల నీరు చేరుతోంది.   జలాశయం నుంచి 60,453 క్యూసెక్కుల నీటిని  పెన్నానదికి విడుదల చేస్తుండటంతో  పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.  నిండుకుండను తలపిస్తూ 72 టీఎంసీలకు చేరిన సోమశిల నీటినిల్వ చేరింది.   సోమశిల జలాశయం పూర్తి నీటినిల్వ 78.9 టీఎంసీలుగా ఉంది. 

Sat, 10 Sep 202204:29 AM IST

శ్రీశైలానికి వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం కొనసాగుతోంది.  10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల  చేస్తున్నారు.  ఇన్ ఫ్లో 3,56,442 క్యూసెక్కులు కాగా,  ఔట్ ఫ్లో 4,40,991 క్యూసెక్కులుగా ఉంది.  పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది.  ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులకు చేరుకుంది. 

Sat, 10 Sep 202204:29 AM IST

సర్వ దర్శనానికి 24 గంటలు

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.  అన్ని కంపార్టుమెంట్లు నిండి రాం భగీచా వరకు  భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని  64,292 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,641 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.  నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు లభించింది.