December 29 Telugu News Updates : కందుకూరు దుర్ఘటనపై ప్రధాని సంతాపం….-andhra pradesh telugu live news updates 29 december 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Telugu Live News Updates 29 December 2022

కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి(MINT_PRINT)

December 29 Telugu News Updates : కందుకూరు దుర్ఘటనపై ప్రధాని సంతాపం….

04:39 PM ISTB.S.Chandra
  • Share on Facebook
04:39 PM IST

  • టీడీపీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతులకు రూ.2లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల సాయాన్ని అందించనున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. 

Thu, 29 Dec 202204:39 PM IST

మందుబాబులకు గుడ్ న్యూస్… 

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఇంకేముంది ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ రోజున మద్యం ఏరులై పారాల్సిందే అన్నట్టే ఉంటుంది పరిస్థితి చూస్తే. వైన్స్ ల ముందు భారీ క్యూలైన్లలో దర్శనమిస్తారు మందుబాబులు. అయితే ఈసారి టీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంచి కిక్కేనిచ్చే వార్తను అందించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు వైన్స్ తెరిచే ఉండనున్నాయి. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఒంటి గంట వ‌ర‌కు మ‌ద్యం విక్ర‌యాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌రకు, 2బీ లైసెన్స్ గ‌ల బార్లు ఒంటి గంట వ‌ర‌కు తెరిచి ఉండ‌నున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లలో మద్యం అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఫలితంగా డిసెంబర్ 31న సమయాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది.

Thu, 29 Dec 202204:03 PM IST

భేటీ

ఏపీ పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గురువారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్... సీజేఐతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్న సీజేఐకి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.

Thu, 29 Dec 202201:46 PM IST

ప్లేస్ ఖరారు

Pawan Varahi Vehicle: త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దీనికి 'వారాహి' అని పేరు కూడా పెట్టారు. అయితే వాహనానికి తొలిపూజ చేసే తేదీతో పాటు ప్లేస్ ను ఖరారు చేశారు. జనవరి 2వ తేదీన కొండగట్టులో పూజలు నిర్వహించనున్నారు. 

Thu, 29 Dec 202201:45 PM IST

బీఎల్ సంతోష్ కామెంట్స్

సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసుపై బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని కామెంట్స్ చేశారు.

Thu, 29 Dec 202211:41 AM IST

ఇంఛార్జ్ డీజీపీ

అంజనీ కుమార్ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్ గా పనిచేయడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్ డీఐజీగా, వరంగల్ ఐజీగా పని చేయటంతో పాటు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా చేశారు. 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా చేరారు. 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్ నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేసిన అధికారిగా కూడా ఆయనకు పేరుంది.

Thu, 29 Dec 202211:40 AM IST

పరామర్శ

మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మామ హరినాధ్ రావు మృతికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. రాయదుర్గం లోని వారి నివాసానికి వెళ్లి హరినాధ రావు పార్ధీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి KTR, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Thu, 29 Dec 202210:56 AM IST

చంద్రబాబు పరామర్శ

నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఓగూరులో టీడీపీ కార్యకర్త గడ్డం మధు మృతదేహం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఓదార్చారు. బాధిత కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు.

Thu, 29 Dec 202209:38 AM IST

ఏం చేయబోతుంది..?

సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏకంగా సిట్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటమే కాకుండా... కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు 98 పేజీలతో కూడిన తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. కేసును సీబీఐకి ఇవ్వడానికి గల కారణాలను 45 రూపంలో వివరించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ కాస్త సీబీఐ పరిధిలోకి వెళ్లటంతో... తెలంగాణ సర్కార్ ఏం చేయబోతుందనేది ఆసక్తిని రేపుతోంది.

Thu, 29 Dec 202207:13 AM IST

రెండో రోజు రైతు బంధు నిధుల విడుదల 

పదో విడత రైతుబంధులో భాగంగా రెండో రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. తొలిరోజు ఎకరం చొప్పున 22,45,137 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.758,19,25,476 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రెండో రోజు  మరో 15.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమచేసింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున 24,36,775 ఎకరాలకు రూ.1,218.38 కోట్లు బ్యాంక్‌ అకౌంట్లలో జమచేసింది. ఇప్పటివరకు 9 విడతల్లో సాయం అందించగా, 10వ విడత కింద 70.54 లక్షల మందికి రూ.5 వేల చొప్పున రూ.7,676.61 కోట్లను అందజేయనున్నది. 

Thu, 29 Dec 202207:01 AM IST

సిర్పూర్ సభలో లో మంత్రి హరీశ్ రావు

రామగుండం గల్లీలో ప్రధాని ఒకమాట, డీల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. సింగరేణి 4 గనులు ఎలా ప్రైవేటు పరం చేస్తారని ప్రశ్నించారు. బిజెపి హటావో.. సింగరేణి బచావో నినాదంతో సింగరేణి ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.  పనులు చేసే పార్టీ బి ఆర్ ఎస్, పన్నులు వేసే పార్టీ బిజెపి అని విమర్శించారు. 

Thu, 29 Dec 202206:55 AM IST

హైకోర్టుని ఆశ్రయించిన సునీల్ కనుగోలు.....

హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసి నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఈ నెల 30న హాజరుకావాలని సునీల్ కనుగోలకు నోటీసులు జారీ చేయడాన్ని  సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41 సి ఆర్ టి సి పై స్టే ఇవ్వాలని కోరారు. సునీల్  పిటిషన్‌పై రేపు  హైకోర్టు విచారణ జరుపనుంది. 

Thu, 29 Dec 202206:36 AM IST

కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆగ్రహం

టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.   స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే ఎనిమిది మంది అమాయకులు బలి అయ్యారని ఆరోపించారు.  ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారని,  టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారన్నారు. తప్పుని తెలుసుకోకుండా పిచ్చి ప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని  వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అన్నారు. 

Thu, 29 Dec 202206:35 AM IST

ముగిసిన పోస్టుమార్టం ప్రక్రియ

కందుకూరు ఏరియా ఆస్పత్రిలో దుర్ఘటనలో మృతిచెందిన వారికి పోస్టుమార్టం ప్రక్రియ ముగిసింది.  కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మృతదేహాలు తరలించారు.  ఎనిమిది మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేసిన వైద్యులు .  అధిక ఒత్తిడి, తొక్కిసలాటలో ఊపిరాడక మృతిచెందినట్లు వైద్యుల ప్రాథమిక అంచనాలో పేర్కొన్నారు. 

Thu, 29 Dec 202206:34 AM IST

ప్రచార వ్యామోహం వల్లే ప్రమాదం….

నెల్లూరు జిల్లాలో  చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్లే ఎనిమిది మంది మృతి చెందారని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.  విజన్ గురించి మాట్లాడే చంద్రబాబుకు,  అసలు విజనే లేదన్నారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలిగొన్నారు - చంద్రబాబు అధికార వ్యామోహం తగ్గించుకుంటే మంచిదని సూచించారు. 

Thu, 29 Dec 202206:32 AM IST

టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

కందుకూరు ప్రమాదంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  చంద్రబాబు వల్లే ఎనిమిది మంది చనిపోయారని  వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఇరుకు సందులో రోడ్‍షో నిర్వహించి ప్రాణాలు తీశారని వైసీపీ ఆరోపిస్తోంది.  తక్కువమందిని ఎక్కువగా చూపించేందుకు టీడీపీ ప్రయత్నించిందని,  డ్రోన్ షాట్లతో పొలిటికల్ మైలేజ్ పొందాలనుకున్నారన్న వైసీపీ ఆరోపించింది. మరోవైపు ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ ఎదురుదాడికి దిగింది.  మీటింగ్‍లు పెట్టనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ ఆరోపిస్తోంది. 

Thu, 29 Dec 202206:30 AM IST

పవన్ కళ్యాణ్‌ సంతాపం…..

కందుకూరు ప్రమాద ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. కందుకూరు ప్రమాదం దురదృష్టకరమని  ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను  అని,  అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదంలో మృతిచెందడం ఎంతో విచారకరం అన్నారు.- మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. 

Thu, 29 Dec 202206:28 AM IST

కందుకూరు ఘటనపై కేసు నమోదు

కందుకూరు తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  కందుకూరు పీఎస్‍లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

Thu, 29 Dec 202206:36 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ….

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  19 కంపార్టుమెంట్లలో  భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.  నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లుగా నమోదైంది. 

Thu, 29 Dec 202206:26 AM IST

తిరుమలలో చీఫ్‌ జస్టిస్‌

బారత ప్రధాన న్యాయమూర్తి తిరుమలలో పర్యటిస్తున్నారు.  తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత  సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్  సాయంత్రం 6.45కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం విజయవాడ వెళ్లి దుర్గమ్మను దర్శించుకోనున్నారు.  రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. - రేపు హైకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొంటారు.  మంగళగిరి మండలం కాజా వద్ద జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించనున్నారు.  అనంతరంసీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ హైదరాబాద్ వెళ్లనున్నారు. 

Thu, 29 Dec 202206:36 AM IST

మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన సీఎం

కందుకూరు ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి  అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం  అండగా నిలుస్తుందన్నారు.