Ap Constable Recruitment :కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు కాల్ లెటర్స్-andhra pradesh state level police recruitment board released hall tickets for physical examinations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh State Level Police Recruitment Board Released Hall Tickets For Physical Examinations

Ap Constable Recruitment :కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు కాల్ లెటర్స్

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 09:17 AM IST

Ap Constable Recruitment ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాతపరీక్షల్లో అర్హత సాధించి, శారీరక సామర్థ్య పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి హాల్‌ టిక్కెట్లు విడుదల చేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల
పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల

Ap Constable Recruitment ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక పరీక్షల్లో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్‌ కోసం హాల్ టిక్కెట్లను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయడానికి ప్రాథమిక రాత పరీక్షలు నిర్వహించారు. రాత పరీక్షల్లో అర్హత పొందిన వారికి ఫిజికల్‌ ఈవెంట్స్‌ కోసం హాల్‌ టిక్కెట్లు విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించి ఫేజ్‌-2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు సంబంధించిన కాల్‌ లెటర్లు మార్చి 10 మధ్యాహ్నం 3గంటల వరకు అందుబాటులో ఉంటాయని పోలీసు నియామక మండలి తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పాటు మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ను సందర్శించాల్సి ఉంటుంది.

ఒక్కో పోస్టుకు 16మంది పోటీ..

కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు.

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారంతా స్టేజ్‌-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది, 95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు.

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,209మంది అర్హత సాధించారు.

కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. 200మార్కులకు ఓసీ అభ్యర్థులు 80మార్కులు సాధించిన వారిని తదుపరి పరీక్షలకు అర్హులుగా నిర్ణయించారు. బీసీ అభ్యర్థులకు 35శాతం మార్కుల్ని కటాఫ్‌గా నిర్ణయించారు. 200మార్కులకు 70మార్కులు వచ్చిన వారిని అర్హులుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30శాతం కటాఫ్‌గా నిర్ణయించారు. 60 మార్కులు వచ్చిన వారిని మిగిలిన దశలకు అర్హులుగా ప్రకటించారు.

ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీ కీను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై 2261 అభ్యంతరాలు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. వచ్చిన అభ‌్యంతరాలపై అయా సబ్జెక్టు నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 3 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు ప్రకటించారు. తుది సమాధానాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు సంబందించిన అప్డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ను పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 94414 50639, 91002 03323 నంబర్లను సంప్రదించాలని బోర్డు ఛైర్మన్ సూచించారు.

IPL_Entry_Point