SSC Hall Tickets and INTER Exams :నేటి నుంచి పదో తరగతి హాల్ టిక్కెట్లు..
SSC Hall Tickets and INTER Exams ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు నేటి నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. విద్యార్ధులు హాల్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
SSC Hall Tickets and INTER Exams ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు హాల్ టిక్కెట్లు మంగళవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. విద్యార్ధుల హాల్ టిక్కెట్లను https://www.bse.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి స్కూల్ కోడ్, పాస్‌వర్డ్ ఉపయోగించి డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు జిల్లాల వారీ పర్యవేక్షకులను పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ నియమిస్తూ సోమవారం మరో ఉత్తర్వులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షల హాల్‌టిక్కెట్లను SSC తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8న ఆంగ్లం, ఏప్రిల్ 10న గణితం, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్ష జరగనుంది. ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి కూడా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు….
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
వేసవి దృష్ట్యా అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స పరికరాలు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. 20-25 కేంద్రాలకు ఒక 108 అంబులెన్సును అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆర్‌టిసి తగినన్ని బస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజ్, మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టిస్తారని, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఇప్పటికే ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద జెరాక్స్, ఫొటో కాపీయింగ్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నోడల్ అధికారిని నియమించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనరు సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు, ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తదితరులు ఇంటర్ పరీక్షల్ని సమన్వయం చేస్తున్నారు.
మరోవైపు ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,03,990 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరికోసం 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లను పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలని ఆదేశించారు. ప్రిన్సిపల్స్‌ను సంప్రదించి హాల్ టిక్కెట్లు పొందాలని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ 18004257635 నెంబరుకు సంప్రదించాలని సూచించారు. పరీక్షలను పూర్తిస్థాయి సిసి కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.