AP Aarogyasri Services : ఏపీలో రేపట్నుంచి నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు…! నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రకటన
AP Aarogyasri EHS Services : ఏపీలోని ఆరోగ్య శ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిచిపోనున్నాయి. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటన చేశాయి. జనవరి 6వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపేస్తామని స్పష్టం చేశారు.
పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాని(ఎన్టీఆర్ వైద్య సేవ)కి ఏపీలో ఇబ్బందులు తలెత్తాయి. రేపట్నుంచి(జనవరి 06) ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఈహెచ్ఎస్ (ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు) నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి.
పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని.. లేకుంటే ఆరోగ్యశ్రీ సేవలు అందించమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా) అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. సోమవారం నుంచి నగదు రహిత సేవలు అందించలేమని తెలిపారు.
ఇదే విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులిచ్చామని… బకాయిల భారాన్నిమోయలేకపోతున్నామని విజయక్ కుమార్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రూ.1500 కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా…. రూ.3 వేల కోట్లు బకాయిలున్నాయని గుర్తు చేశారు. తక్షణమే నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉందని.. లేకపోతే ఆస్పత్రులను నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంక్‌లు కూడా సహకరించడం లేదన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈవో ఫోన్‌లో చెప్పారని…. సోమవారం చర్చలకు రావాలన్నారని వివరించారు.
ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదని డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. ఆరోగ్య బీమాలో కనీసం కో-పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఏపీలో బీమా విధానంలో ఆరోగ్య సేవలు:
మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 1 కోటి 43 లక్షల కుటుంబాల్లోని 4 కోట్ల 30 లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా రూ.25 లక్షల వరకు వైద్య సాయం అందుతుందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని చెప్పారు.
కొత్త విధానంలో పేదలకు నాణ్యమైన వేద్య సేవలు అందుతాయని మంత్రి సత్య కుమార్ అభయం ఇచ్చారు. ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవ కార్యక్రమంలో నిమగ్నం చేసి, పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి, ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
హైబ్రిడ్ మోడల్ వల్ల రూ.2.5 లక్షల లోపల ఉచిత వైద్య సేవలు ఉండవని, పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ యాదవ్‌చెప్పారు.
రూ.2.5 లక్షల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 61 లక్షల కుంటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకకు వైద్య సేవ అందుతుంది కాబట్టి, దానిని అనుసంధానం చేసుకుంటూ, రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం బీమా కంపెనీలు, ఆస్పత్రులతో మాట్లాడినట్లు వివరించారు.