AP Employees: మా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు: బొప్పరాజు
AP Employees: ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత భవనాల్లో రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు. చాలా ఘటనల్లో ఉద్యోగులే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ ఘటన జరుగుతుందోనని ఉద్యోగులంతా భయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా అని బోప్పరాజు ప్రశ్నించారు.
రికార్డులు భద్రపరిచే వ్యవస్థ ఉందా..?
'మా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టడు. మదనపల్లి ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉంది. ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఫైల్స్ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులే దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ ఉందా? రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా అధికారులు ఉన్నారా? అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా?' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
ఆ నిర్ణయం మంచిదే..
'ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదే. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నాం. ఆ లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నాం. ఐఆర్‌సీ, 12వ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం' అని బోప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు..
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారన్నారు. వైసీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. రెవెన్యూ సదస్సుల్లో గ్రామస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు అధికారులు పాల్గొని సమస్యలకు పరిష్కారం చూపుతారని మంత్రి స్పష్టం చేశారు.