APSRTC Fake Job Notification : ఏపీఎస్‌ఆర్టీసీ నకిలీ జాబ్ నోటిఫికేషన్..మోసపోకండి-andhra pradesh public transport department alert on apsrtc fake job notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Public Transport Department Alert On Apsrtc Fake Job Notification :

APSRTC Fake Job Notification : ఏపీఎస్‌ఆర్టీసీ నకిలీ జాబ్ నోటిఫికేషన్..మోసపోకండి

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 05:56 AM IST

APSRTC Fake Job Notification ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్ని నమ్మొద్దని ప్రజా రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టులు ప్రజా రవాణా శాఖ అధికారుల దృష్టికి రావడంతో హెచ్చరించారు.

ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసీ (Hindustan times)

APSRTC Fake Job Notification ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలంటూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో గత కొన్ని రోజులుగా ఓ నోటిఫికేషన్ అలర్ట్ హల్చల్ చేస్తోంది. అందులో కొన్ని లింకుల్ని కూడా ఉంచారు. నిర్దేశిత రుసుములు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కారు.

ట్రెండింగ్ వార్తలు

ఆర్టీసీలో డ్రైవర్‌, కండక్టర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటం ప్రజా రవాణా శాఖ అధికారుల దృష్టికి సైతం వచ్చింది. దీంతో ప్రభుత్వం అనుమతించకుండా నోటిఫికేషన్ ఎలా విడుదలైందా అనే సందేహం అధికారులకు వచ్చింది.

ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వాట్సాప్‌ సందేశాల్లో పేర్కొన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మార్చారు. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏపీపీటీడీగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగుల విలీన ప్రక్రియ కూడా ఎప్పుడో ముగిసింది. గతంలో ఉద్యోగుల నియామకాలు ట్రాన్స్‌ పోర్ట్ కార్పోరేషన్ పరిధిలో ఉండేది.

ప్రజా రవాణా విభాగంగా మారిన తర్వాత ఆర్టీసీలో ఉద్యోగుల నియామకాలు మొదలు, వేతనాల చెల్లింపు వరకు అన్ని ప్రభుత్వమే చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక విధివిధానాలన్ని పిటిడికి కూడా అమలవుతాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌గా మారిన ఆర్టీసీలో ఖాళీలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.

ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి నియామకాలు చేపట్టదు. ఆర్టీసీలో ఉద్యోగాలు అనేది తప్పుడు ప్రచారం అని, దీనిని ఎవరూ నమ్మొద్దని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఉద్యోగాల కోసం ఫీజు చెల్లించాలని, ఆధార్‌ వివరాలు నమోదు చేయాలని, బ్యాంకు ఓటీపీ వివరాలు తెలపాలంటూ నకిలీ సందేశాల్లో ఉందని, సైబర్‌ మోసాలకు పాల్పడేందుకు ఇలా ప్రచారం చేస్తున్నట్లు ఆశావహుల్ని హెచ్చరించింది. గతంలో కూడా ఇదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగాలంటూ ఫేక్‌ మెయిల్స్‌ పంపి మోసాలకు పాల్పడ్డారని గుర్తు చేసింది. నిరుద్యోగులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వ నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని గుర్తించాలని సూచిస్తున్నారు.

IPL_Entry_Point