AP Politics: 2024లో కింగ్‌ మేకర్‌ ఎవరు..?-andhra pradesh politics who will be the kingmaker in 2024 assembly elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Politics Who Will Be The Kingmaker In 2024 Assembly Elections

AP Politics: 2024లో కింగ్‌ మేకర్‌ ఎవరు..?

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 01:03 PM IST

‘శాసన మండలి ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తే పప్పులో కాలేసినట్టే! పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు అనేక కారణాలు ఉన్నాయి..’ - పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ అనలిస్ట్ ఎ.నాగరాజు విశ్లేషణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే పొరపాటే అవుతుంది. అది వాపేగానీ, బలుపు కాదు. గతంలో ఇవే పట్టభద్రుల నియోజకవర్గాల్లో గెలిచిన బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. కాబట్టి, ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తే పప్పులో కాలేసినట్టే! పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ విశ్లేషించుకుని, జాగ్రత్తగా నడుచుకుంటేనే టీడీపీకి మనుగడ! కాదని, కన్ను మిన్నూ కానకుండా అనుకూల మీడియా రాతలు, భజనపరుల మాటల ప్రకారం నడుచుకుంటే 2024లోనూ బొక్క బోర్లా పడటం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు

వ్యతిరేకతకు సంకేతాలు

ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో తక్కువ ఓట్లు ఉండటం వల్ల ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటిలో అధికార వైఎస్సార్‌సీపీ గెలవడం గొప్పేమీ కాదు. వాటితో పోలిస్తే అత్యధిక ఓటర్లు పాల్గొనే పట్టభద్రుల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ మీద ఉన్న వ్యతిరేకత తాలూకు సంకేతాలకు అద్దం పడుతున్నాయి. రాయలసీమలోనే పరిస్థితి ఇలా ఉందంటే, ఇవే ఎన్నికలు అమరావతి, గుంటూరు, కృష్ణా, గోదావారి ప్రాంతాలలో జరిగితే పాలక పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇంకా తీవ్ర స్థాయిలో బయటపడేది. గడిచిన నాలుగేళ్లలో అధికార వైఎస్సార్‌సీపీ మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వస్తోందని ఇప్పటికే అనేక సర్వేల్లో తేలింది. అదే ఈ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది.

వారి కష్టం టీడీపీకి బదిలీ

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడగట్టడంలో ప్రజాసంఘాలు, వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్లంతా చేసిన ఉద్యమాల ఫలితమంతా టీడీపీకి బదిలీ అయ్యింది. మొదటి ప్రాధాన్యతా ఓటు తమ పార్టీలకు వేసుకొని, రెండో ప్రాధాన్యత ఓటును టీడీపీకి వేశాయి. దీంతో టీడీపీ గట్టెక్కింది.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో రెండో ప్రాధాన్యత ఓట్లు పీడీఎఫ్‌ నుంచి 76.6 శాతం (6645) ఓట్లు, బీజేపీ నుంచి 73.6 శాతం (3959) ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యాయి. అదే సమయంలో పీడీఎఫ్‌ నుంచి 23.4 శాతం (2025) ఓట్లు, బీజేపీ నుంచి 26.3 శాతం(1414) ఓట్లు మాత్రమే వైఎస్సార్‌ సీపీకి బదిలీ అయ్యాయి.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో పీడీఎఫ్‌ నుంచి 73.7 శాతం (8355) ఓట్లు, బీజేపీ నుంచి 65.5 శాతం (2004) ఓట్లు టీడీపీకి బదిలీ కాగా, వైఎస్సార్‌సీపీకి పీడీఎఫ్‌ నుంచి 26.3 శాతం (2974) ఓట్లు, బీజేపీ నుంచి 34.5 శాతం (1051) ఓట్లు బదిలీ అయ్యాయి.

పశ్చిమ రాయలసీమలో పీడీఎఫ్‌ నుంచి 75.4 శాతం (9886) ఓట్లు, బీజేపీ నుంచి 72.8 శాతం (3312) ఓట్లు టీడీపీకి బదిలీ కాగా, వైఎస్సార్‌సీపీకి పీడీఎఫ్‌ నుంచి 25.3 శాతం(3352) ఓట్లు, బీజేపీ నుంచి 27.2 శాతం (1237) ఓట్లు బదిలీ అయ్యాయి. మూడు నియోజకవర్గాల్లో పీడీఎఫ్‌ వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లకు తోడు, జనసేనతో పరోక్షంగా మద్దతివ్వడం టీడీపీకి కలిసొచ్చింది.

కలుపుకుపోతేనే టిడిపికి భవిష్యత్తు

పట్టభద్రుల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, రైతులు ఉంటారు. బటన్‌ నొక్కే సంక్షేమ పథకాలు కాకుండా ధరల పెరుగుదల, రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు వంటి వాటిని ఎక్కువగా పట్టించుకునే వర్గంలో వీరుంటారు. ఈ వ్యతిరేక పవనాలను ప్రతిపక్షాలు జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటేనే తప్పా, అధికార వైఎస్సార్‌సీపీని వచ్చే ఎన్నికల్లో ఓడిరచడం కష్టం. ఎందుకంటే, ముఖ్యంత్రి వై.ఎస్‌.జగన్‌ ఈ ఓటమిని సీరియస్‌గా తీసుకొని తమ వ్యుహాలకు పదును పెడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ వ్యూహాలు పట్టభద్రుల్లో ఉన్న అసహనం చల్లార్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి, జగన్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పార్టీలన్నింటినీ కలుపుకుంటూ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తేనే టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేనిపక్షంలో 2019 ఎన్నికల ఫలితాలు పునరావృత్తం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పొత్తులే టిడిపిని గట్టెక్కించగలదు

1983, 2019 లో మాత్రమే టీడీపీ ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసింది. దివంగత నేత శ్రీ ఎన్టీఆర్‌ బ్రతికున్న కాలంలో కానీ, 1995 చంద్రబాబునాయుడు చేతికి పార్టీపగ్గాలు వచ్చినా గానీ ప్రతిసారి సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనసేన లేదా ఏదో ఇతర పార్టీతో కలిసే పోటీ చేసి అధికార పీఠం ఎక్కింది. 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకవేళ జనసేనతో, ఇతర రాజకీయపార్టీలను కలుపుకుని పోకపోతే మరోసారి టిడిపి చతికిల పడుతుంది. జనసేన పార్టీ ఒకవేళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే ప్రతిపక్షాల ఓట్లు చీలి, వైసీపీ గట్టెక్కేది.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 0.3 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికార పీఠం కైవసం చేసుకోవడానికి కారణం జనసేన, బీజేపీ పార్టీలు టీడీపీకి మద్దతివ్వడమే. అదే 2019లో జనసేన, బీజేపీ వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి టీడీపీ ఓడిపోయింది. జనసేనకు 2019 ఎన్నికల్లో 20 వేల నుంచి 30 వేల పైచిలుకు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 18 ఉన్నాయి. అలాగే, 15 వేల నుంచి 20 వేల ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 20 ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు 14.84 శాతం ఓట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 11.68 శాతం ఓట్లు, విశాఖపట్నంలో 8.58 శాతం ఓట్లు వచ్చాయి. గోదావరి జిల్లాల్లో నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మెజారిటీ 5 వేల లోపే ఉండగా, మరో 5 స్థానాల్లో 5 నుంచి 10 వేల లోపు మెజారిటీ సాధించారు. గోదావరి జిల్లాల్లోని 15 సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మెజారిటీ కంటే జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఊహించనంత అధికంగా ఉన్నాయి. పైగా, ఈ సారి ఆ పార్టీకి ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ పోషించిన పాత్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోషిస్తుంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నిర్ణయాత్మక పాత్ర మరింత కీలకం కాబోతోంది.

2024లో జనసేన పార్టీయే కింగ్‌ మేకర్‌?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరపరాజయం పొందిన తరువాత ఈ నాలుగేళ్ల కాలంలో జనసేన పార్టీ సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా బలపడుతూ వస్తోంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అనేకమంది జనసేన కార్యకర్తలు క్రియాశీలంగా పని చేస్తున్నారు. అనేక గ్రామాల్లో జనసేన నాయకులు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచారు. ‘‘కేవలం ర్యాలీలకు, సభలకు వస్తారు కానీ, కనీసం ఇంట్లో వాళ్లతో కూడా జనసేనకు ఓటు వేయించలేరు’’ అనే మాట వచ్చే ఎన్నికల తర్వాత వినపడకపోవచ్చు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, ఆంధ్రాలో అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితులపై విస్తృతంగా ‘‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం’’ కార్యక్రమం నిర్వహించడం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ‘‘జనవాణి’’ కార్యక్రమం చేపట్టడం, వైసీపీ కట్టించిన డొల్ల ఇళ్లను బయటపెట్టడం, అక్రమ ఇసుక దందాపై నిరసనలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రజలతో మమేకమవుతూ ప్రజల ఆదరఅభిమానాలను పొందుతోంది. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కూడగట్టడంలో జనసేన విజయం సాధించింది. ఇవి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చాయి.

సోషల్‌ మీడియాకే పరిమితమనుకున్న జనసైనికులు ఇప్పుడు క్షేత్రస్థాయిలోనూ తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇటీవల జనసేనపార్టీ చేపట్టిన సభ్యత నమోదు కార్యక్రమంలో క్రియశీలక సభ్యత్వాల సంఖ్య 6 లక్షలు దాటడం ఆ పార్టీ కార్యకర్తల నిబద్ధతను తెలియజేస్తుంది. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో తేదీ మారినా రాత్రి వరకూ ప్రజలు వెనక్కి వెళ్లిపోకుండా, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం ఆ పార్టీ రాష్ట్రంలో బలపడిరదనడానికి నిదర్శనం. జనసేన పార్టీ యూ ట్యూబ్‌ చానెల్‌ తో పాటు ప్రధాన న్యూస్‌ చానళ్ల యూట్యూబ్‌ ఖాతాలు కలిపి మునుపెన్నడూ లేని విధంగా కేవలం సోషల్‌ మీడియాలోనే లక్షకు పైగా మంది లైవ్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాన్ని విన్నారు. ఇది ఆంధ్రా రాజకీయాలు, జనసేన పట్ల యువతకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలతో సహా కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం ఈ సారి గణనీయంగా ఉండబోతుంది.

2019లోనూ తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి 43.48 శాతం, టీడీపీకి 36.76 శాతం ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య తేడా 8 శాతం కాగా, ఈ జిల్లాలో జనసేనకు వచ్చిన ఓట్లు 14.4 శాతం. పశ్చిమ గోదావరి జిల్లాలోలో వైఎస్సీర్‌సీపీకి 46.35 శాతం, టీడీపీకి 36.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 10 శాతం కాగా, జనసేనకు 11.68 శాతం ఓట్లు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే టిడిపి, జనసేన వేర్వేరుగా పోటీచేయడం వల్ల వైఎస్‌ఆర్‌సిపికి లబ్ధి చేకూరింది.

2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం, ఒక్క చాన్స్‌ అంటూ జగన్‌ గాలి బలంగా వీయడంతో వైఎస్సార్‌సీపీ 49.95 శాతం ఓట్లు ఖాతాలో వేసుకోగా, టీడీపీకి 39.26 శాతం ఓట్లు వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసిన జనసేన 5.54 శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. గత పదేళ్లలో అనేక ఆటుపోట్లకు ఎదురు నిలుస్తూ అనేక విధాలుగా జనసేన బలం పుంజుకున్న దరిమిలా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

2014లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ మద్దతుతో 44.9 శాతం ఓట్లతో టిడిపి102 సీట్లు కైవసం చేసుకుంది. టిడిపి`వైఎస్‌ఆర్‌సిపి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.3 శాతం మాత్రమే. 44.6 శాతం ఓట్లు పొందిన వైఎస్సార్‌సీపీ 67 సీట్లకు పరిమితమైంది.

2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రజారాజ్యం పార్టీ. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తూర్పు గోదావరి జిల్లాలో 30.36 శాతం ఓట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 25.25 శాతం ఓట్లు, విశాఖపట్నంలో 27.56 శాతం ఓట్లు సాధించడంతో ప్రతిపక్షం ఓట్లు చీలి దివంగత నేత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ రెండవసారి విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.

జనసేన పెద్దన్న పాత్ర

అధికార పక్షం మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోవాలి. ఓట్లు చీలనివ్వనని టీడీపీ చెప్పాలి. కానీ, ఆ పని టీడీపీ చేయలేకపోతోంది. జనసేన చొరవ తీసుకొని మరీ ఆ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. అంతకుముందు రణ స్థలంలోనైనా, మొన్న మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ సభలోనైనా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని బలంగా, క్లారిటీతో చెప్పారు. ఒకవైపు టీడీపీకి అమ్ముడుపోయారని, దత్తపుత్రుడు అనే నిందలు భరిస్తూ, మరోవైపు దమ్ముంటే అన్ని సీట్లలో పోటీ చేయాలని రెచ్చగొడుతున్న వైఎస్సార్‌సీపీ మాటలను తట్టుకుంటూ జనసేన త్యాగానికి సిద్ధమైనప్పుడు, టీడీపీ కనీసం ఆలోచించకపోతే కచ్చితంగా 2019 గుణపాఠమే రిపీట్‌ అవుతుంది. 2022లో ఒంగోల్‌ లో జరిగిన మహానాడు విజయవంతం అవ్వడంతో అప్పట్లో టీడీపీ శ్రేణులు ఇలాగే కాలరెగరేశారు. ఆ తర్వాత మంగళగిరి వద్ద జరిగిన వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ చూశాక దారికొచ్చారు. కాబట్టి, రాబోయే పది నెలలూ నేల మీద సాము చేస్తే టీడీపీకే మంచిది.

అంతేతప్ప పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన గెలుపొందిన స్థానాలను చూసి అది బలుపనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదు. పట్టభద్రుల ఎన్నికల్లో టిడిపి గెలుపు వాపు మాత్రమే. ప్రజాభీష్టం వారికింకా పూర్తిగా రాలేదు. ఈ విషయాన్ని టిడిపి అగ్రనాయకత్వం, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు గ్రహిస్తే మంచిది. బీజేపీని ఆంధ్రాలో అంటరాని పార్టీగా చూస్తున్నారనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో బీజేపీ కంటే సీపీఎంకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి, టీడీపీ గెలవడానికి ఈ సారి బీజేపీ కంటే జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల అవసరమే ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. కాదు కాలరెగరేస్తామంటే, మరో ఓటమికి టీడీపీ తలుపులు తెరిచినట్టే!!

- ఎ. నాగరాజు,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

అనలిస్ట్ అమరవాజీ నాగరాజు, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ
అనలిస్ట్ అమరవాజీ నాగరాజు, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

(ఈ వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు రచయిత లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థకు చెందినవి. హెచ్‌టీ తెలుగు వీటికి బాధ్యత వహించదు)

IPL_Entry_Point