AP Police : ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. నేరగాళ్లు తప్పించుకోవడం చాలా కష్టం!
AP Police : ఇటీవల ఊహించని విధంగా నేరాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్తకోత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరు వరకు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చాలామంది నేరం చేసిన తర్వాత ఈజీగా తప్పించుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకుంటున్నా.. సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో భయం లేకుండా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏ మూల నేరం జరిగినా ఆ దృశ్యాలు, నేరగాళ్ల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యేలా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

లక్ష సీసీ కెమెరాలు..
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా ప్రార్ధనా మందిరాలు, సున్నిత ప్రాంతాలు, క్రైమ్ హాట్ స్పాట్‌లు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో కొన్నింటిని ప్రభుత్వం ద్వారా.. మరికొన్నింటిని దాతల ద్వారా సేకరించి ఏర్పాటు చేయనుంది.
డ్రోన్ల వినియోగం..
తాజాగా ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాలను పోలీసు స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించనున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేని చోట్లలో డ్రోన్ల ద్వారా నిఘాపెట్టనున్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు కనీసం ఒక్క డ్రోన్ అయినా అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రోన్లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నేర నియంత్రణకు వినియోగిస్తున్నారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది.
సీసీ కెమెరాల ఆధారంగా..
ఇటీవల కృష్ణా జిల్లా కంకిపాడులో వరుసగా బైక్‌ల దొంగతనాలు జరిగాయి. అయితే.. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. అతని నుంచి రూ.20 లక్షల విలువైన 38 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అటు తిరుపతి జిల్లాలో బాలికపై హత్యాచార ఘటనలోనూ.. సీసీ కెమెరాల ఆధారంగానే నిందితుడ్ని గుర్తించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసును కూడా సీసీ కెమెరాల సాయంతోనే ఛేదించారు.
తప్పు చేయాలంటే..
ఇలా ఎన్నో నేరాలకు పాల్పడిన వారిని నిఘా నేత్రాలు పట్టించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్ది కెమెరాలతోనే పోలీసులు ఈ స్థాయిలో నేరాలు ఛేదించారు. అలాంటిది లక్ష కెమెరాలు ఉంటే.. నేరగాళ్లు తప్పించుకోలేరని, తప్పు చేయాలంటే భయపడతారనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. భవిష్యత్తులో వాటన్నింటిలోనూ నేరగాళ్ల ముఖాలను గుర్తించే వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా నేరగాళ్లు ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారనేది పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఏర్పడుతుంది.